సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (09:29 IST)

జియోకు షాకిచ్చిన వొడాఫోన్... ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచితమే...

దేశీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో తాజాగా తన మొబైల్ కస్టమర్లకు షాకిచ్చింది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీల పేరుతో జియో మినహా ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి ఆరు పైసలు చొప్పున వసూలు చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని రకాల టాప్‌అప్‌లను విడుదల చేసింది. దీంతో మిగిలిన మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తాయని భావించారు. 
 
కానీ, దేశీయ అతిపెద్ద టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా జియోకు షాకిచ్చింది. తన వినియోగదారులకు ఇతర నెట్‌‌వర్క్‌ కాల్స్ కోసం విడిగా బిల్లింగ్ చేసే ఉద్దేశం తమకు లేదని ప్రకటించింది. ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ చేసే కాల్స్‌ ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచితమేనని తెలిపింది. వినియోగదారులపై భారం పడకూడదనేది తమ లక్ష్యమని వెల్లడించింది. అంతేకాదు, ఐయూసీ ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటించడం తొందరపాటు చర్య అని పేర్కొంది. ఇంటర్ కనెక్ట్‌ మధ్య ఇది పరిష్కారం తీసుకురాలేదని అభిప్రాయపడింది. 
 
తమ కస్టమర్లలో 60 శాతం కంటే ఎక్కువ మంది తక్కువ ఖర్చు చేసే బ్రాకెట్‌లో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ కోసం టాప్-అప్ ప్యాక్‌ల అదనపు అవసరాన్ని వారి భరించాలని కోరుకోరని వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి, వొడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారుడు వారి మొబైల్ కనెక్షన్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి రూ.24 రీఛార్జ్ చేయవలసి ఉంటుంది, ఇది 28 రోజుల చెల్లుబాటులో ఉంటుంది.