శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (10:05 IST)

రిలయన్స్ జియో షాక్... చార్జీల వడ్డన... జియోకు మినహాయింపు...

రిలయన్స్ జియో షాకిచ్చింది. ఇప్పటిదాకా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్‌ సదుపాయం అందిస్తున్న టెలికం సంస్థ రిలయన్స్‌ జియో (జియో) తాజాగా చార్జీల వడ్డనకు తెరతీసింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు బుధవారం ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది. 
 
కాల్‌ టెర్మినేషన్‌ చార్జీలకు సంబంధించి అనిశ్చితే చార్జీల విధింపునకు కారణమని ఒక ప్రకటనలో వివరించింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ చేయదల్చుకునే వారు ఐయూసీ టాప్‌-అప్‌ వోచర్స్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టాప్‌ అప్‌ వోచర్స్‌ విలువకు సరిసమానమైన డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు, దీంతో నికరంగా యూజరుపై చార్జీల భారం ఉండబోదని జియో తెలిపింది. కాల్‌ టెర్మినేషన్‌ చార్జీలు అమల్లో ఉన్నంత వరకూ 6 పైసల చార్జీల విధింపు కొనసాగనున్నట్లు పేర్కొంది.  
 
జియో యూజర్లు ఇతర జియో ఫోన్లకు, ల్యాండ్‌లైన్లకు చేసే కాల్స్‌కు, వాట్సాప్, ఫేస్‌టైమ్‌ తదితర యాప్స్‌ ద్వారా చేసే కాల్స్‌కు దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఉచితంగానే కొనసాగుతాయని జియో పేర్కొంది. ప్రస్తుతం జియో యూజర్లు కేవలం డేటాకు మాత్రమే చార్జీలు చెల్లిస్తున్నారు. దీనితో దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని పొందుతున్నారు. తాజా పరిణామంతో జియో యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ చేయాలంటే రెగ్యులర్‌ రీచార్జితో పాటు తప్పనిసరిగా టాప్-అప్‌ వోచర్స్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  
 
కొత్త ఐయూసీ ప్లాన్లు ఇవే..
ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ కోసం జియో కొత్తగా నాలుగు ఐయూసీ ప్లాన్స్‌ను(టాప్‌ అప్స్‌) ప్రవేశపెట్టింది. ప్లాన్స్‌కి సరిపడా డేటా ఉచితంగా ఇస్తున్నందున ఈ ఏడాది డిసెంబర్‌ 31 దాకా యూజర్లపై నికరంగా అదనపు భారం ఉండబోదని జియో తెలిపింది. ఇక పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లకు కూడా అఫ్‌–నెట్‌వర్క్‌ కాల్స్‌పై నిమిషానికి  6 పైసల జార్జీలు వర్తిస్తాయి. తదనుగుణంగా ఉచిత డేటా లభిస్తుంది. కొత్త ఐయూసీ ప్లాన్లు..
 
రూ. 10 ప్లాన్‌: 124 నిమిషాలు. 1 జీబీ డేటా.
రూ. 20 ప్లాన్‌: 249 నిమిషాలు. 2 జీబీ డేటా.
రూ. 50 ప్లాన్‌: 656 నిమిషాలు. 5 జీబీ డేటా.
రూ. 100 ప్లాన్‌: 1,362 నిమిషాలు. 10 జీబీ డేటా.