ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ విషయాన్నిలోక్ సభలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఓటు హక్కు పరిరక్షణకు వీలుగా ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
తద్వారా ఇకపై ఎవరు ఓటు వేశారో.. ఎవరు వేయలేదో కూడా తెలుసుకునే వీలు ఉంటుందని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. కాగా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎప్పటికప్పుడు బోగస్ కార్డులు బటయపడుతూనే ఉన్నాయి.. మరోవైపు.. తమ ఓటు గల్లంతు అయ్యిందంటూ ఆందోళన వ్యక్తం చేసేవారు కూడా లేకపోలేదు.. ఎన్నికలకు వచ్చిన ప్రతీసారి ఇది ఎన్నికల సంఘానికి పెద్ద తలనొప్పిగా మారింది.
ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా బోగస్ కార్డులను ఈసీ నియంత్రించలేకపోతోంది. అయితే, బోగస్ కార్డులను అరికట్టేందుకు ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని ఇప్పటికే న్యాయ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఇక ఈరోజు కేంద్రమంత్రి ప్రకటనను తర్వాత ఆ వైపుగా కేంద్రం దృష్టి సారించిందని అర్ధమవుతుంది.