మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (22:45 IST)

వాట్సాప్ సరికొత్త ఫీచర్‌.. ''వ్యూ వన్స్'' ఫొటో లేదా వీడియోను సెండ్ చేస్తున్నప్పుడు?

సోషల్ మెసేజింగ్ యాప్‌లలో అగ్రగామి వాట్సాప్.. సరికొత్త ఫీచర్‌ను తెచ్చింది. స్టేబుల్ వెర్షన్ యాప్‌కు 'వ్యూ వన్స్' పేరుతో డిజప్పియరింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఫీచర్‌ను యాడ్ చేసింది. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లోని మీడియా ఫీచర్ మాదిరిగా పనిచేస్తుంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్‌తో యూజర్ల చాట్స్ నుంచి వచ్చిన ఫోటోలు లేదా వీడియోలు రిసీపియంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి.
 
ఏదేని ఫోటో లేదా వీడియోను సెండ్ చేస్తున్నప్పుడు సెండ్ బటన్‌కు ఎడమ వైపున ఉన్న '1' బటన్‌ ట్యాప్ చేసినట్లయితే అది 'వ్యూ వన్స్'గా మారిపోతుంది. రిసీపియంట్ సదరు ఫొటో, వీడియో తెరిచిన తర్వాత వెంటనే తొలగించబడుతుంది. కొత్త ఫీచర్‌ను ఉపయోగించి యూజర్లు పంపే ఏదైనా కంటెంట్ రిసీపియంట్ ఫోటోస్ లేదా గ్యాలరీలో సేవ్ కాదని కంపెనీ నిర్ధారించింది. 
 
'వ్యూ వన్స్' ఫీచర్‌ ద్వారా పంపిన లేదా రిసీవ్ చేసుకున్న ఫొటోలు లేదా వీడియోలను ఫార్వార్డ్, సేవ్, స్టార్ మార్క్ లేదా షేర్ చేసే అవకాశం ఉండదు. రిసీపియంట్ వాట్సాప్‌లో టిక్ మార్క్స్ ఆన్ చేసి ఉంటే.. 'వ్యూ వన్స్ ఫొటో లేదా వీడియో'ను వారు ఓపెన్ చేసినట్టు మాత్రమే యాజర్లు చూడగలరు.
 
అంతేకాదు కొత్త ఫీచర్ ద్వారా పంపిన ఫోటో లేదా వీడియోను పంపిన 14 రోజుల్లోపు తెరవకపోతే, ఎక్స్‌పైర్ అవుతుందని కంపెనీ పేర్కొంది. అయితే, బ్యాకప్ టైమ్‌లోనూ సదరు మెసేజ్ చదవకుండా ఉండిపోతే బ్యాకప్ నుంచి 'వ్యూ వన్స్ మీడియా'ను రీస్టోర్ చేసుకోవచ్చు. కాగా ఈ కొత్త ఫీచర్ ప్రతికూలతల విషయానికొస్తే.. యూజర్లు పంపిన ఫొటో డిజప్పియర్ అవడానికి ముందు స్క్రీన్ షాట్ తీసుకునే వీలుంది.