1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (12:27 IST)

వచ్చే పదేళ్ళకు ఉపయోగపడేలా విండోస్ 11 ఆవిష్కరణ

ప్రతి ఒక్క నెటిజన్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న విండోస్ 11 త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విండోస్ 11 సరికొత్త ఆపరేటింగ్ సిస్టంను వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ గురువారం ఆవిష్కరించింది. 2015లో విండోస్ 10 విడుదలైన తర్వాత మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన మరో ఆవిష్కరణ ఇదే. 
 
విండోస్ 11 ఆవిష్కరణ సందర్భంగా ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. విండోస్ చరిత్రలో దీనిని ఓ మైలురాయిగా అభివర్ణించారు. రానున్న పదేళ్ల వరకు వినియోగదారుల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా దీనిని రూపొందిస్తున్నట్టు చెప్పారు.
 
విండోస్ 11లో స్టార్ట్ మెనూ కొత్తగా ఉంటుందని అన్నారు. టాస్క్ బార్, ఫాంట్, ఐకాన్‌ల విషయంలోనూ సరికొత్త అనుభూతిని అందిస్తుందన్నారు. విండోస్ 11 ఓఎస్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్‌లను కూడా వినియోగించుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందన్నారు. 
 
ఈ ఏడాది చివరినాటికి కొత్త కంప్యూటర్లతోపాటు విండోస్ 10 వినియోగదారులకు కూడా ఈ సరికొత్త ఓఎస్ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని సత్య నాదెళ్ల తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్‌ ఫోన్లు, ఇతర స్మార్ట్ పరికరాలు ప్రజాదరణ పొందడంతో విండోస్.. ఆపిల్, గూగుల్ నుంచి గట్టి పోటీని మైక్రోసాఫ్ట్ ఎదుర్కొంటోందని తెలిపారు.