1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (09:35 IST)

కలియుగంలో దుర్యోధనుడు నరేంద్ర మోడీ : ప్రియాంకా గాంధీ

దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన తండ్రిని నంబర్ వన్ అవినీతిపరుడంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రిని కలియుగంలో దుర్యోధనుడుతో పోల్చారు. హర్యానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె నిప్పుల వర్షం కురిపించారు. 
 
దురహంకారమే దుర్యోధనుడి పతనానికి కారణమైందని, పవిత్ర భారతదేశం ఎన్నడూ కూడా దురహంకారాన్ని క్షమించదని హెచ్చరించారు. 'వాళ్లకు ఏ అంశం దొరకనప్పుడు మా కుటుంబాన్ని కించపరుస్తుంటారు. ఈ దేశం ఎప్పుడూ దురహంకారాన్ని క్షమించలేదు. దీనికి చరిత్రే సాక్ష్యం. మహాభారతం కూడా సాక్ష్యమే. ఇదే దురహంకారం దుర్యోధనుడికి కూడా ఉండేది. శ్రీకృష్ణుడు అతని వద్దకు వెళ్లి నిజమేమిటో చెబితే... శ్రీకృష్ణుడినే బంధించేందుకు ప్రయత్నించాడు' అని ప్రియాంకా గాంధీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి హెచ్చరికలను ప్రస్తావిస్తూ రాసిన ఒక పద్యం పంక్తులను ఆమె చదివి వినిపించారు. 
 
ఇదిలావుంటే రాజీవ్‌ను నంబర్ 1 అవినీతిపరుడుగా ప్రధాని మోడీ పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రధాని స్థాయిలో ఉన్న ఆయన ఆ తరహా వ్యాఖ్యలు చేసివుండకూడదని అంటున్నారు. అంతేనా.. ఢిల్లీ యూనివర్సిటీ ఉపాధ్యాయులు ఏకంగా ఓ ప్రకటనలో మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన రాజీవ్‌ గాంధీపై అవమానకర వ్యాఖ్యలతో మోడీ ప్రధాని పదవి గౌరవాన్ని దిగజార్చారంటూ మండిపడ్డారు.