గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (15:43 IST)

కాషాయ దళంలోకి జయప్రద.. అజంఖాన్‌పై పోటీ?

ప్రముఖ సినీ నటి జయప్రద భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు జాతీయ చానెల్ ఒకటి వార్తను ప్రచారం చేసింది. గతంలో సమాజ్‌వాదీ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆమె ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా, ఆ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండటంతో జయప్రద కూడా దూరమయ్యారు. 
 
గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జయప్రద... ఇపుడు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఒకవేళ ఆమె బీజేపీలో చేరితే తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి ఆజమ్‌ ఖాన్‌పై పోటీ చేసే అవకాశాలున్నాయి. రామ్‌పూర్‌ స్థానం నుంచి ఆమె బరిలోకి దిగే అవకాశముంది. రాష్ట్ర మాజీ మంత్రి ఆజమ్‌ ఖాన్‌ను ఈసారి రామ్‌పూర్‌ నుంచి సమాజ్‌వాది పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.
 
గత 2009లో జరిగిన ఎన్నికల్లో జయప్రద ఈ స్థానం నుంచి 30 వేల మెజార్టీతో ఎంపీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆజమ్‌ ఖాన్‌కు, జయప్రదకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఆమ్‌ఖాన్‌ను ఖల్జిగా జయప్రద అభివర్ణించింది. తన నగ్న ఫొటోలంటూ కొన్నింటిని ఓటర్లకు పంచారని, తనపై యాసిడ్‌ దాడికి ఆజమ్‌ ఖాన్‌ ప్రయత్నించారంటూ ఆరోపించారు. ఇపుడు ఆమె గనుకు బీజేపీలో చేరి రామ్‌పూర్‌ నుంచి బరిలోకి దిగితే... పోటీ తీవ్రస్థాయిలో ఉండే అవకాశముంది.