ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నామినేషన్ వేశారు. 17వ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఇందుకోసం గురువారమే వారణాసికి చేరుకున్న ఆయన... శుక్రవారం ఉదయం నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ నామినేషన్ పత్రాల దాఖలకు ముందు ఆయన వారణాసిలో రోడ్‌షో నిర్వహించారు. దీనికి బీజేపీ శ్రేణులతో పాటు భారీ సంఖ్యల ప్రజలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, శిరోమణి అకాలీదళ్ చీఫ్ ప్రకాశ్ సింగ్ బాదల్, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్, తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
నామినేషన్ దాఖలు చేసే కంటే ముందు.. అక్కడి కాలభైరవ ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మోడీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. మళ్లీ మోడీ సర్కార్‌ను గెలిపించాలన్న గట్టి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారని మోడీ చెప్పుకొచ్చారు.
వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో మోడీపై కాంగ్రెస్ పార్టీ తరపున అజయ్ రాయ్ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఎస్పీ-బీఎస్పీ కూటమి నుంచి షాలినీ యాదవ్ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి మే 19న ఎన్నికలు జరగనున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో వారణాసి నుంచి గెలుపొందిన మోడీకి 5,81,022 ఓట్లు రాగా, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు 2,09,238 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్‌కు 75,614 ఓట్లు మాత్రమే వచ్చాయి.
కాగా, గత 2014 సాధారణ ఎన్నికల్లో వారణాసితో పాటు వడోదర(గుజరాత్) నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు. అయితే వడోదర నుంచి తప్పుకున్న మోడీ.. వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. నాటి ఎన్నికల్లో వారణాసి స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై 3 లక్షల ఓట్ల తేడాతో నరేంద్ర మోడీ విజయం సాధించారు. అలాగే, వడోదర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మధుసూద మిస్త్రీ మీద భారీ మెజార్టీతో గెలుపొందారు.
నామినేషన్‌కు ముందు ప్రధాని పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని, కానీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేది ప్రజలే అన్నారు. మోడీ గెలిచినా, గెలవక పోయినా ప్రజాస్వామ్యం ఖచ్చితంగా గెలుస్తుందన్నారు. కాశీలోని ప్రతి పౌరుడు తనను ఆశీర్వదిస్తారన్న పూర్తి నమ్మకం తనకు ఉందన్నారు. ఈసారి ఓటింగ్ శాతం పెరగాలని, మహిళా ఓటింగ్ శాతం మరింత అధికంగా ఉండాలన్నారు.
కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలు భయంతో పని చేయాల్సి వస్తోందని, అక్కడి ప్రభుత్వాలు సురక్షితంగా ఉండనివ్వడం లేదని ఆరోపించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరే వరకు కుటుంబ సభ్యులు ఆందోళనతో గడపాల్సిన దుస్థితి ఆ రాష్ట్రాల్లో ఉండటం సిగ్గుచేటని నరేంద్ర మోడీ ఆరోపించారు.