శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (10:15 IST)

ఉగ్రవాదుల ఆయుధం కంటే ప్రజల చేతిలోని ఓటు శక్తివంతం : నరేంద్ర మోడీ

పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉందనీ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. 
 
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ జరుగుతోంది. ఇందులోభాగంగా, గుజరాత్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన సొంతూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ పాఠశాల బూత్‌లో ఆయన ఓటు వేశారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేశానని చెప్పారు. కుంభమేళాలో పాల్గొన్నంత ఆనందంగా ఉందని.. పవిత్ర స్నానం తర్వాత ఎలాగైతే స్వచ్ఛతను పొందుతామో.. ఓటు వేసిన అనంతరం అలాంటి అనుభూతినే పొందుతామన్నారు. భారతీయ ఓటర్లు తెలివైనవారని.. ఎవరు సమర్థంగా పనిచేస్తారో వారికి తెలుసని మోడీ అన్నారు. 
 
'ఉగ్రవాదుల ఆయుధం ఎల్‌ఈడీ. ప్రజల ఆయుధం ఓటు. ఎల్‌ఈడీ కంటే ఓటే శక్తవంతం. అసలైన ఆయుధం ప్రజల వద్దే ఉంది. ఓటు సామర్థ్యాన్ని తెలుసుకోవాలి' అన్నారు. 21వ శతాబ్దంలో పుట్టినవారు ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్నారన్న మోడీ.. తమ భవిష్యత్త కోసం వారు ఖచ్చితంగా ఓటేయాలని పిలుపునిచ్చారు.