శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Updated : గురువారం, 23 మే 2019 (10:14 IST)

#ElectionResults2019 : ఢిల్లీలో కాషాయం... ఏపీలో ఫ్యాను... వెనుకంజలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఫ్యాను గాలి బలంగా వీస్తోంది. సైకిల్ రెండు టైర్లూ పంక్చర్ అయ్యాయి. మరోవైపు, కేంద్రంలో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గురువారం ఉదయం నుంచి వెల్లడవుతున్నాయి.
 
ఈ ఫలితాల్లో ఏపీలో వైకాపా, ఢిల్లీలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మొత్తం 542 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగగా, వీటిలో బీజేపీ కూటమి ఏకంగా 321 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అలాగే, ఏపీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకుగాను వైకాపా 141 చోట్ల, టీడీపీ 22 చోట్ల ఆధిక్యంలో ఉంది. జనసేన పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 
 
మొత్తంమీద ఫ్యాన్‌ ప్రభంజనంలో రాష్ట్రమంతా టీడీపీ కొట్టుకుపోతుండగా.. ఏకంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సైతం ఫ్యాన్‌ షాక్‌ ఇస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తన కంచుకోట అయిన కుప్పంలో వరుసగా గెలుస్తూ వస్తున్న చంద్రబాబు ఈసారి వెనుకబడ్డారు. మొదటి రెండు రౌండ్లలోనూ ఆయన వెనుకబడటం టీడీపీకి షాకిచ్చింది. రెండురౌండ్ల కౌంటింగ్‌ ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రమౌళి.. చంద్రబాబుపై 357 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. 
 
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైసీపీ అభ్యర్థి మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ 3500 ఓట్లతో ముందు కొనసాగుతున్నారు. శృంగవరపు కోట నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు తొలి రౌండ్‌లో 1317 ఓట్లు ఆధిక్యం సాధించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి రెండో రౌండ్‌లో 75 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. నెల్లిమర్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిబడుకొండ అప్పలనాయుడు 750 ఓట్లు ఆధిక్యం దక్కించుకున్నారు.