సీఆర్‌పీఎఫ్ జవాన్ల ప్రతీకారం : 20 మంది మావోయిస్టులు మృతి
మావోయిస్టులపై సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. బీజాపూర్ జిల్లాలో మంగళవారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు.
మావోయిస్టులపై సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. బీజాపూర్ జిల్లాలో మంగళవారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల సీఆర్‌పీఎఫ్ జవాన్లపై పంజా విసిరిన సంగతి తెల్సిందే. తాజాగా మావోయిస్టులపై జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నాయి.
గత నెల 24న సుక్మా జిల్లా బుర్కన్‌పాల్‌లో మావోయిస్టులు 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను చంపేసిన నేపథ్యంలో సీఆర్‌పీఫ్ జవాన్లు, రాష్ట్ర పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. బీజాపూర్ జిల్లా బాసగూడ ఠాణా పరిధిలోని రాయిగూడెం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన భద్రతా బలగాలకు మంగళవారం ఉదయం మావోయిస్టులు తారసపడటంతో ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయని పోలీసు అధికారులు చెప్పారు.
కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు చనిపోయారని, కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని సీఆర్‌పీఎఫ్ ఐజీ దేవేంద్ర చౌహాన్ విలేకరులకు తెలిపారు. మూడు రోజుల కిందట ఇదే ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడగా, వీరిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి ప్రత్యేక బలగాలను తరలించి గాలింపును ముమ్మరం చేశారు.