శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 డిశెంబరు 2019 (10:25 IST)

ఢిల్లీ భారీ అగ్నిప్రమాదం... 40 మంది మృతి...

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు సుమారుగా 40 మంది మేరకు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండిలో గల ఓ భవనంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు హుటాహుటిన తరలించారు. 30కిపైగా అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను చల్లారుస్తున్నాయి. మంటల్లో చిక్కుకున్న 56 మందిని అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలతో రక్షించింది. 
 
కాగా, ఇరుకైన బహుళ అంతస్తు భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పైగా, ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో ఊపిరాడక అనేక మంది చనిపోయారు. ఫలితంగానే మృతుల సంఖ్య భారీగా ఉంది. ఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో ఇంకా దట్టమైన పొగలు కమ్ముకునే ఉన్నాయి. 
 
మంటలు అదుపులోనికి వచ్చాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డిప్యూటీ చీప్ ఫైర్ అధికారి సునీల్ చౌదరి తెలిపారు. భవనంలో ఫ్యాక్టరీ నడుస్తోందని, అక్కడే సిబ్బంది రాత్రి నిద్రించిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
 
మరోవైపు, ఈ ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, హోం మంత్రి అమిత్ షాలు స్పందించారు. ఈ భారీ అగ్నిప్రమాదంపై అమిత్‌షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణం సహాయక చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులు త్వరలోనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. 
 
ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. తక్షణ సహాయక చర్యలకు అధికారులను అదేశించారు. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.