తాతయ్య కోసం.. స్ట్రెచర్‌ను నెట్టుకెళ్లిన ఆరేళ్ల బాలుడు.. వీడియో వైరల్
కరోనా వేళ.. కొన్ని ఆస్పత్రుల్లో కొన్ని దారుణ ఘటనలు చోటుచేసుకుంటూనే వున్నాయి. లంచం కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారున్నారు. తాజాగా స్ట్రెచర్ కోసం లంచం అడిగిన ఓ వార్డు బాయ్‌కి డబ్బివ్వలేని ఓ నిరుపేద కుటుంబంలోని ఆరేళ్ల బాలుడే స్వయంగా స్ట్రెచర్‌ను తోసుకుంటూ వెళ్లిన వైనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్, డియోరియా జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. డియోరియా జిల్లాలోని గౌర గ్రామానికి చెందిన చెడి యాదవ్ రెండు రోజుల క్రితం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆయన కాలు ఫ్యాక్చర్ కావడంతో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సర్జికల్ వార్డులో ఉన్న యాదవ్‌ను డ్రెస్సింగ్ కోసం వేరే వార్డుకు తరలించాల్సి వచ్చింది. అయితే స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు అక్కడున్న వార్డ్ బాయ్ 30 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో యాదవ్‌కు సాయంగా వచ్చిన ఆయన కుమార్తె బిందు వద్ద డబ్బులు లేకపోవడంతో వాళ్లే స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. అయితే తల్లి కష్టం చూసి ఆ పసివాడి మనసు చలించిందో ఏమోకానీ, అక్కడే ఉన్న బిందు ఆరేళ్ల కుమారుడు శివం కూడా తన వంతుగా ముందుకొచ్చాడు.
బిందు ముందుండి స్ట్రెచర్‌ను లాగితే.. శివం వెనుక తోస్తూ సాయం చేశాడు. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.