బ్యాంకు క్లర్క్‌కు జాక్‌పాట్ : లాటరీ టిక్కెట్ కొన్న గంటకే రూ.కోటి
చాలా మంది ఏమాత్రం కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలన్న ఆశ ఉంటుంది. ఇలాంటి వారు తమ చేతిలో డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. అలా ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఓ గంటలోనే కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పంజాప్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన రూపీందర్ జిత్ సింగ్ ఓ గ్రామీణ వ్యవసాయ బ్యాంకులో క్లర్క్‌గా పని చేస్తున్నాడుు. ఈయన గత యేడాది కాలంగా లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఎప్పటిలాగే రూపీందర్ జిత్ సింగ్ నాగాలాండ్ బంపర్ లాటరీ టిక్కెట్లు ఒక్కోటి రూ.6 చొప్పున 25 టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆయన ఎప్పటిలానే బ్యాంకుకు వెళ్లి తన విధుల్లో నిమగ్నమయ్యాడు.
ఓ గంట తర్వాత ఆయనకు లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఏకంగా రూ.కోటి గెలుచుకున్నట్టు ఏజెంట్ చెప్పాడు. దీంతో, రూపీందర్ సంబరం అంబరాన్నంటింది. ఈ డబ్బును తన పిల్లలు, కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని ఆయన చెప్పారు.