తిరునల్వేలిలో వరదలు అబ్బబ్బా.. కాంక్రీట్ భవనమే కూలిపోయింది..
తమిళనాడు దక్షిణాది జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. దక్షిణ తమిళనాడులో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది.
దీనిపై తమిళనాడు వర్షాలపై చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్ బాలచంద్రన్ మాట్లాడుతూ, "రాబోయే 24 గంటలపాటు, తెన్‌కాసి, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాలకు 'రెడ్' అలర్ట్ కొనసాగుతుంది.. అన్నారు.
డిసెంబర్ 16 ఉదయం నుండి డిసెంబర్ 17 వరకు తిరునెల్వేలి అతి భారీ వర్షపాతాన్ని చవిచూసింది. కన్యాకుమారి, రామనాథపురం, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నంతో సహా ఇతర జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ నివేదించింది.
తూత్తుకుడిలోని తిరుచెందూర్‌లో సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల వరకు 606 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. భారీ వర్షాల కారణంగా తిరునల్వేలి జలమయం అయ్యింది.
రోడ్లపై వరద నీరు చెరువుల్లా దర్శనమిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ భవనాలు సగానికి సగం నీటిలో మునిగిపోయాయి. అలాగే ఓ భవనం భారీ వరదల కారణంగా నేలమట్టమైంది.
వరద ధాటికి ఓ కాంక్రీట్ భవనం మొత్తం నేలమట్టం అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.