శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2023 (22:41 IST)

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - పవన్ నివాసానికి చంద్రబాబు

babu - pawan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ నివాసానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి వెళ్లారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే, ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై  కూడా వారు చర్చించనున్నారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌ దిశగా చర్చలు జరుగుతున్నాయని జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఏపీలో టీడీపీ - జనసేన పార్టీ కలిసి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెల్సిందే. 
 
కాగా, గత 2014 ఎన్నికలకు ముందు పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి ఆయన నివాసానికి వెళ్ళి భేటీ కావడం గమనార్హం. కాగా, టీడీపీ మహానాడులు సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన మినీ మేనిఫెస్టోకి జనసేన పార్టీ మరికొన్ని అంశాలను జోడించాలని ఇప్పటికే సూచించిన విషయం తెల్సిందే. దీంతో ఇరు పార్టీలు కలిసి మొత్తం 10 అంశాలతో ఉమ్మడి కార్యాచరణను రూపొందించి, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తుంది. ముఖ్యంగా, యువతి, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన అంశాన్ని జనసేన సూచించినట్టు సమాచారం. 
 
ఈ రెండు పార్టీల పొత్తు నేపథ్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో ఇప్పటికే టీడీపీ చేపట్టిన కార్యకర్మం పేరులోనూ మార్పులు చేయనున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు - పవన్ కళ్యాణ్‌‍ల ఫోటోలు ముద్రించిన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. పైగా, వచ్చే యేడాది ఆరంభంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడయ్యే అవకాశం ఉండటంతో సట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి అవకాశముందని సమాచారం.