శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (22:53 IST)

మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించేందుకు క్యూ కట్టిన ప్రముఖులు

chiru - kcr
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు.. సినీ ప్రముఖులు యశోద ఆస్పత్రికి క్యూ కట్టారు. కేసీఆర్ కాలి తుంటి ఎముకకు ఆపరేషన్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఆయనను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోమవారం పరామర్శించారు. ఇలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. 
 
ఆ తర్వాత చిరంజీవి మాట్లాడుతూ, తాను కేసీఆర్‌ను పరామర్శించానని, ఆయన ఆరోగ్యంతో హుషారుగా ఉన్నారని చెప్పారు. ఆరు వారాల్లోగా ఆయన కోలుకోవచ్చని వైద్యులు చెప్పారని తెలిపారు. సర్జరీ తర్వాత 24 గంటల్లోనే ఆయన నడిచేలా వైద్యులు చూసుకున్నారని చెప్పారు. కేసీఆర్ సాధ్యమైనంత త్వరగా కోలుకుని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 
 
ఈ సందర్భంగా కేసీఆర్ తనను చిత్రపరిశ్రమ గురించి అడిగినట్టు చెప్పారు. సినిమాలు ఎలా ఆడుతున్నాయి? ఇండస్ట్రీ ఎలా ఉంది? అని ఆయన అడిగారని తెలిపారు. ఇకపోతే, ఆస్పత్రిలోనే ఉన్న కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు కూడా తనను ఆప్యాయంగా పలుకరించారు. అదేవిధంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క‌లు కూడా కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు. 

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసిన టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. pic.twitter.com/MJQ4cPkn5n