మమతా బెనర్జీ కాలు విరిగినా. ఆ గుండె నిబ్బరం అదుర్స్.. జయా బచ్చన్
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తల పగిలినా, కాలు విరిగినా ఆమె గుండె నిబ్బరంగానే ఉందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ తెలిపారు. టీఎంసీకి మద్దతుగా ప్రచారం కోసం సోమవారం ఆమె కోల్‌కతా వచ్చారు. మమత తల పగులగొట్టారు, కాలు విరగొట్టారు కానీ వారు (బీజేపీ నేతలు) ఆమె గుండె, మెదడును దెబ్బతీయలేకపోయారని విమర్శించారు.
ముందుకు సాగాలని, బెంగాల్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా చేయాలనే మమత సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేకపోయారని దుయ్యబట్టారు. మమతా జీ ఏమి చేయాలనుకున్నా ఆమె అది చేస్తారని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.
టీఎంసీకి మద్దతుగా ఇక్కడకు వెళ్లాలని తమ పార్టీ నేత అఖిలేస్ యాదవ్ కోరారని జయా బచ్చన్ తెలిపారు. అన్ని దారుణాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒంటరి మహిళ అయిన మమతా జీ పట్ల తనకు చాలా ప్రేమ, గౌరవం ఉందన్నారు.
మరోవైపు బెంగాల్‌కు జయా బచ్చన్ రాకను తాను స్వాగతిస్తున్నట్లు బీజేపీ అభ్యర్థి బాబుల్ సుప్రియో తెలిపారు. ఆమె తనకు చాలా తెలుసని, కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడబోనని చెప్పారు. జయా బచ్చన్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడవచ్చని, అయితే ఎప్పుడూ కూడా తనకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడలేదని గుర్తు చేశారు.