ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్
ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదన్నారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఓటర్ల జాబితాను అప్ డేట్ చేస్తున్నారు. జనవరి ఒకటో తేదీతో 18 యేళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. యువతలో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు, ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అర్హులను ఓటర్ జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మరణించిన వారి పేర్లను తొలగిస్తున్నారు.
ఇందులోభాగంగా గతేడాది ఆగస్టులో బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే నిర్వహించారని సీఈసీ వెల్లడించారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, కొత్త ఓటర్ల పేర్లను చేర్చి మొత్తంగా సవరించిన ఓటర్ల జాబితాను ఈ నెల 6వ తేదీన విడుదల చేయనున్నట్లు ఢిల్లీ సీఈసీ ఆఫీసు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే తప్పుడు పత్రాలతో ఓటర్ ఐడీ పొందిన ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించింది. ఒకటి కంటే ఎక్కువ ఐడీ కార్డుల కలిగి ఉండడం కూడా శిక్షార్హమైన నేరమని పేర్కొంది. ఓటర్ కార్డు ఉందంటే ఓటేసేందుకు గ్యారంటీ కాదని తెలిపింది.