ఇంట్లో ఎవరూ లేరు వచ్చేయంటూ యువతి ఫోన్, తెల్లారేసరికి చెరువులో శవమై తేలాడు  
                                       
                  
				  				  
				   
                  				  మా ఇంట్లో ఎవ్వరూ లేరు, త్వరగా వచ్చేయ్ అంటూ తన ప్రియుడికి యువతి ఫోన్ చేసింది. స్వయంగా ప్రియురాలే అలా పిలిస్తే ఇంక అతడి ఆనందానికి అవధుల్లేవు. నిమిషాల్లో వాలిపోయాడు. కానీ తెల్లారేసరికి ఊరికి సమీపంలోని చెరువులో శవమై తేలాడు. ఏం జరిగింది?
				  											
																													
									  
	 
	వివరాలు ఇలా వున్నాయి. మీరట్ లోని అటోరా గ్రామంలో 19 ఏళ్ల అభిషేక్ గుర్జర్ డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఐతే తను చదివే కాలేజీలోని ఆ యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. ఇక ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అతడితో యువతి సన్నిహితంగా మాట్లాడుతున్న సమయంలో ఇంట్లో పెద్దలకు తెలిసిపోయింది.
				  
	 
	తమ కుమార్తె జోలికి రావద్దంటూ యువకుడిని హెచ్చరించారు. దాంతో రెండుమూడు వారాలు ఇద్దరూ కాస్త దూరాన్ని పాటించినా మళ్లీ యువకుడు ప్రియురాలికి సందేశాలు పంపడం, కలుసుకోవడం మొదలుపెట్టాడు. అలా ఆమె ఫోనులో మాట్లాడుతుండగా ఆమె తల్లిదండ్రులు నిలదీశారు. ఫోన్ తనిఖీ చేయగా అతడు 12 సార్లు ఆమెకి ఫోన్ చేయడమే కాకుండా నిమిషాలకొద్దీ ఆమెతో చాటింగ్ చేసినట్లు తెలుసుకున్నారు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఇక అతడిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయానికి వచ్చారు. అచ్చం సినిమా స్టైల్లో యువతి చుట్టూ మూగి... రాత్రి 11 గంటలకు ఆ యువకుడికి ఇంట్లో ఎవరూ లేరు వచ్చేయమంటూ యువతితో ఫోన్ చేయించారు. యువతి నుంచి ఫోన్ రాగానే అభిషేక్ వెంటనే అక్కడికి వెళ్లాడు. అప్పటికే అక్కడే మాటువేసి వున్న యువతి కుటుంబసభ్యులు అతడిని కర్రలతో గొడ్డును బాదినట్లు బాది హత్య చేసారు.
				  																		
											
									  
	 
	అనంతరం ఊరికి సమీపంలోని చెరువులో అతడి మృతదేహాన్ని పడేసి ఏమీ తెలియనట్లు వచ్చేసారు. తెల్లారాక స్థానికులు చెరువులో యువకుడి మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. తమ కుమారుడి హత్యకు అతడి గర్ల్ ఫ్రెండ్, ఆమె కుటుంబ సభ్యులే కారణమని మృతుడి పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.