గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 20 జులై 2020 (18:02 IST)

కేంద్రీయ విద్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

కేంద్రీయ విద్యాలయాల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలల కోసం దరఖాస్తుల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. 

కరోనా వైరస్‌ తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటే సెప్టెంబరు 15 నుంచి తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలున్నాయి. 
 
నల్లపాడు, తెనాలి, సత్తెనపలి, సూర్యలంక, నాదెండ్ల మండలంలోని ఇర్లపాడు కేవీలు గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో విజయవాడలోనే రెండు కేవీలు ఉండగా మరొకటి మచిలీపట్నంలో ఉంది. 
 
నల్లపాడులో మినహా మిగిలిన కేవీల్లో ఒక్కో సెక్షన్‌ ఉంది. ప్రతి కేవీలోను ఒకటో తరగతిలో 40 మందికి ప్రవేశాలకు అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ఐదేళ్లు పూర్తయి ఏడేళ్లు నిండని చిన్నారులు ఒకటో తరగతిలో ప్రవేశానికి అర్హులు.
 
ఏడో తేదీ వరకు గడువు
ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 20వ తేదీ ఉదయం 10 నుంచి వచ్చేనెల 7వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఉంది. రెండో తరగతితో పాటు ఇతర తరగతుల్లో ఖాళీలను ఈనెల 20, 25వ తేదీ లోపు గుర్తిస్తారు. 
 
ఈ ఆరు రోజుల్లోనే రెండు నుంచి పదో తరగతిలోపు ప్రవేశాలకు వివరాల్ని విద్యార్థులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 30వ తేదీ నుంచి వచ్చే నెల 7లోపు ఆఫ్‌లైన్‌లోనే ఖాళీలు భర్తీ చేయనున్నారు. 
 
పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రాలు విద్యార్థులకు మంజూరు చేసిన వారం రోజుల్లోపే ఇంటర్‌లో ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
 
నాలుగు ప్రాధమ్యాలు
ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగంలో పనిచేసేవారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. కేంద్ర అనుబంధ సంస్థలు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులు, ఒకే సంతానం కలిగిన కుటుంబాల్లోని వారికి ప్రాధాన్యం ఉంటుంది. 

పార్లమెంట్‌ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మావన వనరుల మంత్రిత్వ శాఖ, కేవీఎస్‌ ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యం ఉంటుంది.
 
ఆర్‌టీఈలో సీటు దక్కితే ఉచితమే..
15 శాతం సీట్లను ఎస్సీలకు.. 7.5 శాతం సీట్లను ఎస్టీలకు, 3 శాతం సీట్లను దివ్యాంగులకు రిజర్వు చేస్తారు. మిగిలిన సీట్లు ఇతరులకు కేటాయిస్తారు. 
 
జాతీయ విద్యా హక్కు చట్టం(ఆర్‌టీఈ) నిబంధనల మేరకు ప్రతి తరగతిలో 10 సీట్లను ఉచిత బోధనా పద్ధతిలో భర్తీ చేస్తారు. ఆన్‌లైన్‌లోనే లాటరీ ద్వారా వీరి ఎంపిక ఉంటుంది.
 
ఆన్‌లైన్‌లో ప్రక్రియ
కరోనా నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా కూడా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని ఈ ఏడాది కల్పించారు. kvsonlineadmission.kvs.gov.in వెబ్‌సైట్‌తో పాటు కేవీఎస్‌ రూపొందించిన ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్ఛు. 20 నుంచి దరఖాస్తుకు ముందుగానే ధ్రువపత్రాల్ని విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరముంది.