ఐదేళ్ల సహజీవనం.. గర్భం దాల్చగానే వదిలేశాడు.. మంత్రిపై నటి శాంతిని ఫిర్యాదు
తమిళనాడు మాజీ మంత్రి ఎం మణికండన్‌పై నటి శాంతిని ఆరోపించారు. తనను పెండ్లి చేసుకుంటానని నమ్మబలికిన మణికండన్ తాను గర్భం దాల్చగానే వదిలేశాడని వెల్లడించారు. మణికండన్ తనకు బలవంతంగా అబార్షన్ చేయించడమే కాకుండా తన కుటుంబ సభ్యులను బెదిరించాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.
మరోవైపు తనపై తమిళ నటి ఆరోపణలను మణికండన్ తోసిపుచ్చారు. అసలు శాంతిని ఎవరో తనకు తెలియదని అన్నాడు. ఇక మణికండన్‌పై ఆమె శుక్రవారం చెన్నైలో డీసీపీకి ఫిర్యాదు చేశారు.
డీసీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం నటి విలేకరులతో మాట్లాడుతూ ఫిర్యాదు ప్రతిని అందించారు. తాను 2017లో అప్పటి ఏఐఏడీఎంకే సర్కార్‌లో మణికండన్ ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనను కలిశానని ఆమె చెప్పుకొచ్చారు. అప్పటికే మణికండన్‌కు వేరొక మహిళతో వివాహమైనా తనను పెండ్లి చేసుకుంటానని నమ్మబలికాడని శాంతిని ఆరోపించారు.
తాము అప్పటినుంచి చెన్నైలోని బసంత్ నగర్‌లో సహజీవనం చేస్తున్నామని దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. ఈ క్రమంలో తాను మూడుసార్లు గర్భం దాల్చినా వివాహమైన తర్వాత సంతానం కోరుకుందామని చెబుతూ అబార్షన్ చేయించాడని ఆరోపించారు.
తామిద్దరం కలిసి దేశంలో పలు ప్రాంతాలు తిరిగామని అన్నారు. ఏప్రిల్ 2021లో తమ సంబంధానికి మణికండన్ దూరమయ్యాడని.. తాను చెప్పినట్లు చేయకపోతే, నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించినట్లు శాంతిని ఆరోపించారు.