1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

దత్తత వెళ్లిన వ్యక్తికి పుట్టింటి కుటుంబ ఆస్తులపై హక్కు లేదు : హైకోర్టు

Court
దత్తత వెళ్లిన వ్యక్తికి పుట్టిన కుటుంబానికి చెందిన ఆస్తిలో హక్కులు ఉండవని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. ఒక వ్యక్తి రెండు కుటుంబాల్లో ఉండరని, అలాంటప్పుడు ఆస్తిలో హక్కు ఉండదని తెలిపింది. దత్తతకు వెళ్లకముందు భాగపరిష్కారం జరిగి వాటా కేటాయించినట్లయితే.. ఆ ఆస్తిపై మాత్రమే హక్కు ఉంటుందని పేర్కొంది. దత్తతకు వెళ్లకముందు ఎలాంటి కేటాయింపులు లేకపోతే జన్మించిన కుటుంబానికి చెందిన ఆస్తిలో వాటా ఉండదంటూ కీలక తీర్పు వెలువరించింది. 
 
దత్తత వెళ్లినప్పటికీ జన్మించిన కుటుంబం ఆస్తిలో వాటా ఉంటుందంటూ ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన ఎ.వి.ఆర్‌.ఎల్‌.నరసింహారావు ఖమ్మం సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ఆ కోర్టు.. జన్మించిన కుటుంబంలోని ఆస్తిలో వాటా ఉంటుందంటూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నరసింహారావు సోదరుడు ఎ.నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకలతో కూడిన ఫుల్‌బెంచ్‌ సుదీర్ఘంగా విచారించి ఇటీవల తీర్పు వెలువరించింది.
 
ఒకసారి దత్తతకు వెళ్లినప్పుడు పుట్టిన కుటుంబంతో ఉన్న సంబంధాలన్నింటినీ వారు తెంచుకుంటారని, దత్తత తీసుకున్న కొత్త కుటుంబ బంధాలను పొందుతారని చట్టం చెబుతోందని తెలిపింది. పుట్టిన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేనప్పుడు ఆస్తిలో హక్కు పొందజాలరని పేర్కొంది. కోల్‌కతాలోని 'దాయాభాగ', తెలుగు రాష్ట్రాల్లో 'మితాక్షర చట్టం' ప్రకారం పుట్టిన వెంటనే ఉమ్మడి కుటుంబం ఆస్తిలో హక్కు పొందుతాడన్నప్పటికీ ప్రత్యేకంగా హక్కు పేర్కొనలేదంది. 
 
దీని ప్రకారం పూర్వీకుల ఆస్తిలో భాగం ఉంటుందని, అయితే పుట్టిన కుటుంబంలోని వారు సంపాదించిన ఆస్తిలో వాటా ఉండదని స్పష్టం చేసింది. యార్లగడ్డ నాయుడమ్మ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టప్రకారం సరికాదంది. మేన్స్‌ హిందూ చట్టం, ముల్లా సూత్రాలతోపాటు పట్నా, అలహాబాద్‌ హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని.. దత్తతకు ముందు వాటా కేటాయించకపోతే పుట్టిన కుటుంబ ఆస్తిలో హక్కు ఉండదంటూ 44 పేజీల తీర్పును తెలంగాణ హైకోర్టు వెలువరించింది.