అఫ్జల్ గురు తనయుడు గాలిబ్ గురు భారత పౌరుడు కాదా?
అఫ్జలు గురు తనయుడు గాలిబ్ గురు భారత పౌరుడు కాదా? అనే చర్చ ఇపుడు కొత్తగా తెరపైకి వచ్చింది. గాలిబ్ గురుకు ఇప్పటికే ఆధార్ కార్డు కూడా వచ్చింది. కానీ, పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా, దీన్ని కేంద్రం ఇంకా మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో గాలిబ్ గురు పౌరసత్వంపై చర్చ మొదలైంది.
ఇదిలావుంటే తనకు ఆధార్ గుర్తింపు కార్డు రావడంపై గాలిబ్ గురు స్పందిస్తూ, తనకు ఈ గుర్తింపు కార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే పాస్‌పోర్ట్‌కు కూడా ఇప్పిస్తే విదేశాలకు వెళ్లి చదువుకుంటానని చెప్పాడు. ఇప్పటికే తనకు ఇటలీ నుంచి స్కాలర్‌షిప్ ఆఫర్ కూడా వచ్చిందని అన్నాడు. తనకు పాస్‌పోర్ట్ కూడా దక్కితే ఓ భారతీయ పౌరుడిగా తాను చాలా గర్విస్తానని గాలిబ్ చెప్పాడు.
అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించిన ఓ పత్రికపైనా గాలిబ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు పాస్‌పోర్ట్ ఇస్తేనే భారతీయుడిగా గర్విస్తానని సదరు పత్రిక రాసిందని, తన ఉద్దేశం మాత్రం అది కాదని అతను అన్నాడు. కాగా, 2001 జరిగిన పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్ గురును 2013లో భారత ప్రభుత్వం ఉరితీసిన విషయం తెల్సిందే.