శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (20:18 IST)

శరద్ పవార్‌కు ఈసీ షాక్... అజిత్ పవార్‌కే ఎన్సీపీ సొంతం!!

ajith pawar - sharad pawar
దేశంలోనే కురువృద్ధ రాజకీయ నేతగా గుర్తింపు పొందిన కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌కు కేంద్ర ఎన్నిక సంఘం తేరుకోలేని షాకిచ్చింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్‌కు చెందినదని మంగళవారం స్పష్టం చేసింది. ఎన్సీపీ గుర్తు గడియారం కూడా అజిత్ పవార్‌ వర్గానికే కేటాయిస్తున్నట్టు తీసుకుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో తొలి నుంచి కీలక పాత్ర పోషిస్తున్న శరద్ పవార్ 1999లో నాటి కాంగ్రెస్ పార్టీ అద్యక్షురాలు సోనియా గాంధీ విదేశీయతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ ఎన్నికల్లో ఎన్సీపీని స్థాపించారు. తిరిగి 1999లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేశారు. 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్రంలోని యూపీఏ సర్కారులో చేరారు. 2014 వరకూ యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఎన్సీపీ ఉంది. 
 
2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్సీపీ కూడా దెబ్బతిన్నది. అదే ఏడాది చివర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా, సీఎం పదవి విషయమై ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీ నాయకత్వంలో విభేదించి కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపారు. కానీ, వ్యూహాత్మకంగా వ్యహరించిన బీజేపీ.. శివసేన నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనను చీల్చింది. తదుపరి శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీని రెండుగా చీల్చింది. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఎన్సీపీని అజిత్ పవార్‌కు అప్పగిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం శరద్ పవార్‌కు గట్టి షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.