శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2016 (13:05 IST)

ప్రియాంక గాంధీతో అఖిలేశ్ మంతనాలు.. యూపీ ఎన్నికల్లో పొత్తు తథ్యమా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే యేడాది జరుగనున్నాయి. అయితే, ఈ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందుగానే తండ్రీకొడుకులు ఢీ అంటే ఢీ అంటున్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే యేడాది జరుగనున్నాయి. అయితే, ఈ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందుగానే తండ్రీకొడుకులు ఢీ అంటే ఢీ అంటున్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ఆ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తన కొడుకు, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను సైతం ఉపేక్షించలేదు. పార్టీనుంచి ఆరేళ్ళపాటు బహిష్కరించారు. దీంతో అఖిలేశ్ కూడా తండ్రికి మించిన తనయుడిగా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. 
 
ఓవైపు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తూనే మరోవైపు... తనకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. తన తండ్రి తనను పార్టీ నుంచి మాత్రమే బహిష్కరించారని కుటుంబం నుంచి కాదని చెప్తున్నారు. తాను ఇప్పటికీ తన తండ్రితోనే ఉన్నానంటున్నారు. మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యేల్లో తనతో చివరివరకూ ఉండేవారి గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
 
శాసనసభలో బలపరీక్ష అవసరమైతే ఏం చేయాలి? ఎవరి మద్దతు తీసుకుంటే కలిసొస్తుంది? అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇదిలావుండగా, సమాజ్‌వాదీ పార్టీలో అత్యధిక ఎమ్మెల్యేలు అఖిలేశ్‌కు మద్దతుగా గట్టిగా నిలబడుతున్నట్లు, యువత మద్దతు కూడా ఆయనకే ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. 
 
మరోవైపు అఖిలేశ్ కాంగ్రెస్ పార్టీవైపు కూడా చూస్తున్నారని సమాచారం. ఆయన ప్రియాంక గాంధీతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు అవకాశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పొత్తును ములాయం సింగ్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.