గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (12:49 IST)

యూపీ అసెంబ్లీ పోల్స్ : జనవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ ... సుశీల్ చంద్ర

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను నిర్దేశిత సమయంలోనే యధావిధిగా నిర్వహించాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సుశీల్ చంద్ర తెలిపారు. ఆయన గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, అన్ని పార్టీల కోరిక మేరకు జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితాను వెల్లడిస్తామని తెలిపారు. 
 
ఆ తర్వాత మొదటి వారంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. యూపీలో కొత్తగా 52.08 లక్షల మంది ఓటర్లు పెరిగారన్నారు. అలాగే, మహిళా ఓటర్ల సంఖ్య కూడా 5 లక్షలు పెరిగినట్టు చెప్పారు. ఈ ఎన్నికల కోసం బూత్, పోలింగ్‌పై అవగాహన కల్పిస్తామని ఆయన వెల్లడించారు. 
 
పోలింగ్ బూత్‌లన కోవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఓటరుకు శానిటైజర్ ఇస్తామన్నారు. అలాగే, పోలింగ్ సమయాన్ని కూడా ఒక గంట పొడగిస్తామని చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 
 
కాగా, అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం యూపీలో మూడు రోజుల పాటు పర్యటించింది. ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అన్ని పార్టీల నేతల అభిప్రాయాలను కూడా సేకరించింది. ఆ తర్వాత ఢిల్లీలో సీఈసీ సుశీల్ చంద్ర మీడియాతో మాట్లాడారు.