ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 డిశెంబరు 2021 (15:56 IST)

ఒమిక్రాన్ టెన్షన్: నేటి రాత్రి నుంచి కర్ఫ్యూ.. ఎక్కడంటే?

కరోనా కొత్త వేరియంట్‌ చాపికంద నీరులా వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన ఒమిక్రాన్ ప్రస్తుతం భారత్‌లోనూ విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాలనూ వదిలిపెట్టలేదు. మొత్తం 13 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ టెన్షన్ తప్పట్లేదు. దీంతో మళ్లీ ఆయా రాష్ట్రాలు కర్ఫ్యూ బాట పడుతున్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు 400కు చేరువ అవుతోంది.
 
ఇక క్రిస్మస్‌, ఆ వెంటనే న్యూ ఇయర్‌ వేడుకలు.. ఇక సంక్రాంతి పెద్ద పండగ పేరుతో పందాలు, షాపింగ్‌లు ఇలా ఎక్కడ చూసినా జనం గుంపుగుంపులుగా కనిపించే ప్రమాదం ఉంది. దీంతో గుబులు మరింత పెరుగుతోంది. 
 
అందుకే అన్ని రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. కరోనా కొత్త వేరియంట్‌ విస్తరించకుండా ప్రభుత్వాలు ఆంక్షల దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. ఉత్తరప్రదేశ్‌లో నేటి నుంచి నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
 
తాజాగా ఈ జాబితాలోకి మహారాష్ట్ర కూడా చేరింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సినిమా థియేటర్లు, హోటల్స్, రెస్టారెంట్లు 50 శాతం ఆక్యుపెన్సీతో కార్యకలాపాలను కొనసాగించాలని ఆదేశించింది.
 
ఇక పెళ్లి వేడుకలు, ఫంక్షన్లకు కేవలం 250 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. తాజా ఆంక్షలు చూస్తుంటే మళ్లీ లాక్ డౌన్ రోజులు గుర్తుకు వస్తున్నాయి. 
 
మరోవైపు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ తర్వాత నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న మూడో రాష్ట్రం మహారాష్ట్రే కావడం గమనార్హం. ఇక దేశ రాజధాని ఢిల్లీలో క్రిస్మస్‌, కొత్త సంవత్సరం వేడుకలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.