రుతుక్రమంలో ఉంటే స్నేహితుల ఇంటికే వెళ్లం.. ఇక ఆలయానికి ఎలా వెళ్తాం? స్మృతి ఇరానీ ప్రశ్న
రుతుక్రమంలో ఉంటే స్నేహితుల ఇళ్ళకు వెళ్లేందుకు సైతం వెనుకంజ వేస్తామని అలాంటిది ఆలయానికి ఎలా వెళతామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అంటున్నారు. శబరిమల ఆలయంలోకి తరుణి వయసున్న మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె స్పందించారు.
'ప్రస్తుతం నేను మంత్రి స్థానంలో ఉన్నందున సుప్రీంకోర్టు తీర్పుపై వ్యాఖ్యానించలేను. అయితే నాకు ప్రార్థించే హక్కు ఉంది... కానీ అపవిత్రం చేసే హక్కు నాకు లేదని నేను నమ్ముతాను. ఆ తేడాని మనమంతా గమనించి, గౌరవించాలి. రుతుక్రమంలో ఉన్నప్పుడు మనం కనీసం స్నేహితుల ఇళ్లకు వెళ్లేందుకైనా ఇష్టపడతామా? అలాంటప్పుడు దేవుని ఆలయానికి కూడా ఇదే వర్తిస్తుందని ఎందుకు ఆలోచించరు?' అని ప్రశ్నించారు.
అంతేకాకుండా, గతంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా వెల్లడించింది. 'మా పిల్లలు జోరాష్ట్రియన్లు. ఇద్దరూ అగ్ని దేవాలయానికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు. నేను అప్పుడే పుట్టిన నా కుమారుడిని తీసుకుని అగ్నిదేవాలయానికి వెళితే... నన్ను బయటికి పంపించేశారు. అప్పుడు నా కుమారుడు లోపల ఉండగా, నేను రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేశాను' అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.