మంత్రుల అరెస్టుకు రంగం సిద్ధం.. ఎంఎల్ఎల విచారణకు సీబీ'ఐ'.. గవర్నర్ సీరియస్
తమిళనాడులో శశికళ శిబిరం, పళనిస్వామి ప్రభుత్వం నట్టేట మునుగుతున్నట్లే ఉంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐటీ అధికారులను కేబినెట్ మంత్రులు ముగ్గురు బెదిరించిన ఘటన ప్రభుత్వ మనుగడకే ముప్పు తెచ్చేలా ఉంది. ఐటీ ఉచ్చులో ఇరుక్కున్న ఆరోగ్యమంత్రి విజయభాస్కర్
తమిళనాడులో శశికళ శిబిరం, పళనిస్వామి ప్రభుత్వం నట్టేట మునుగుతున్నట్లే ఉంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐటీ అధికారులను కేబినెట్ మంత్రులు ముగ్గురు బెదిరించిన ఘటన ప్రభుత్వ మనుగడకే ముప్పు తెచ్చేలా ఉంది. ఐటీ ఉచ్చులో ఇరుక్కున్న ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ వైపు సీబీఐ కూడా దృష్టి సారించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన అరెస్టు తప్పదని సంకేతాలు వెలువడుతున్నాయి.
ఆర్కేనగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు 90 కోట్ల రూపాయలదాకా పంచిపెట్టిన ఘటనలో అడ్డంగా ఇరుక్కున్న తమిళనాడు మంత్రులు ఐటీ అధికారులను బెదిరించి మరింతగా అభాసు పాలయ్యారు. శశికళ మేనల్లుడు దినకరన్ పట్టులోకి వెళ్లిన అన్నాడీఎంకే పళని గ్రూప్ ఇంటా బయటా పరువు పూర్తిగా పోగొట్టుకుని గవర్నర్ కరుణా కటాక్ష వీక్షణాలపైనే తన మనుగడ ఉంటున్న దుస్థితిలోకి వెళ్లిపోయింది.
అధికారులను బెదిరించిన కేసులో తమ అరెస్టు తప్పదని అంచనాకు వచ్చిన ముగ్గురు మంత్రులు ముందస్తు బెయిల్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సోమవారం నాటికి వీరి భవిష్యత్తు అటో ఇటో తేలిపోనుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో సాగిన ఐటీ దాడులు మంత్రులకు సంకట పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. ఐటీ అధికారుల్ని బెదిరించిన వ్యవహారంలో మంత్రులు ఉడుమలై కే రాధాకృష్ణన్, కామరాజ్, కడంబూరు రాజాలపై అభిరామపురం పోలీసులు నాన్ బెయిల్ సెక్షన్లతో కూడిన కేసుల్ని నమోదు చేశారు.
కువత్తూరు వేదికగా 122 మంది ఎమ్మెల్యేలను బల పరీక్ష సమయంలో బంధించి ఉన్న విషయం తెలిసిందే. విజయభాస్కర్ వద్ద సాగిన ఐటీ విచారణలో కువత్తూరులోని ఎమ్మెల్యేలకు ఆ సమయంలో ఇచ్చిన హామీలు, అప్పగించిన పనులు, కేటాయింపులు తదితర వివరాలకు సంబంధించిన జాబితా ఐటీ వర్గాలుకు చిక్కినట్టు సమాచారం. ఆ జాబితా ఆధారంగా ఎమ్మెల్యేల్ని విచారించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలిసింది.
విచారణ సందర్భంగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వ్యతరేకంగా ఏమాత్రం నోరువిప్పినా సరే పళనిస్వామి ప్రభుత్వాన్ని రద్దు చేసే దిశగా కూడా గవర్నర్ విద్యాసాగరరావు సిద్ధమవుతారన్న వార్తలు పరిస్థితిని మరింత వేడెక్కిస్తున్నాయి. గవర్నర్ మరోసారి కీలకపాత్ర పోషించాల్సిన పరిస్థితులు తమిళనాట నెలకొనడం తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది.