బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (09:17 IST)

కరోనా ఎఫెక్ట్... ఏపి/టీఎస్ భవన్‌ క్యాంటీన్ మూసివేత

జాతీయ విపత్తుగా పరిణమించిన "కోవిద్ -19" (కరోనా వైరస్) వ్యాప్తిని నివార‌ణ‌కు ప్ర‌తిఒక్కరూ సహకరించాలని, దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్‌ల‌లో నిర్వహిస్తున్న క్యాంటీన్‌ను ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 31వ‌ర‌కు  నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఏపి భ‌వన్ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా విడుద‌ల చేసిన ప్రకటనలో తెలిపారు.

 
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ముందు జాగ్రత్త చర్యగా ఎపి భవన్‌లోని సాయి కేటరర్స్ క్యాంటీన్‌ను తక్షణం మూసివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు, దేశ రాజధానిలో వివిధ పనుల నిమిత్తం వచ్చే అధికారులు, సిబ్బంది సహకరించి, కరోనా వైరస్ నిర్మూలనకు తమ వంతు సహకారాన్ని అందించాలని భావన సక్సేనా విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్‌లకు అనుబంధంగా ఉన్న అతిధి గృహాల్లో బస చేస్తున్నవారికి అల్పాహారం, భోజన వసతిని వారివారి రూములకే పార్సిల్స్ ద్వారా అందజేయుట జరుగుతుందని, ఇందుకు క్యాంటీన్ వారికీ, భవన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అల్పాహారం, భోజనం కొరకు నిరంతరం వస్తున్న ప్రజలకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని, కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఇరు భవన్‌ల ప్రాంగణాలలో నివసిస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వివిధ పనుల నిమిత్తం ఢిల్లీకి వచ్చి ఎపి/టిఎస్ భవన్‌ల అతిధి గృహాల్లో విడిది చేస్తున్న వారు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించ‌డంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టి, నిర్మూలించేందుకు చేస్తున్న సూచనలను తూ.చా తప్పక పాటించి తమ ఆరోగ్యాలను, తోటి ప్రజల ఆరోగ్యాలను కాపాడటంలో సహకారాన్ని అందించాలని కోరారు.