మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (13:38 IST)

మూడోసారి ముచ్చటగా ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్.. బేబీ మఫ్లర్ మ్యాన్‌‌కు స్పెషల్ ఇన్విటేషన్

Aravind Kejriwal
దేశ రాజధాని నగరం ఢిల్లీకి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని విజయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 16)న ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. మూడో సారి ముచ్చటగా అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. గత కొన్నేళ్లుగా ఒక రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు చేపట్టే సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన సీఎంలు, ప్రముఖ నేతలను ఆహ్వానించడం ఆనవాయితీ. ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి తమిళనాడుకు చెందిన డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు. 
 
ఇదే క్రమంలో ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి కీలక నేతలు వస్తారని అందరూ ఆసక్తితో ఎదురుచూశారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ ప్రజలకు మాత్రమే ఆహ్వానం అందింది. ఇందులో ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ మఫ్లర్, కంటి అద్దాలు వేసి అరవింద్ కేజ్రీవాల్‌ను పోలిన ఓ బాలుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ఈ బేబీ మఫ్లర్ మ్యాన్‌కు అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం లభించింది. ఈ బేబీ మఫ్లర్ మ్యాన్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నాడు. ఇతని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.