అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలిన చీతా హెలికాఫ్టర్
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. భారత పదాతిదళానికి చెందిన చీతా హెలికాప్టర్ ఒకటి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తవాంగ్ ప్రాంతంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది.
రోజువారీ విధుల్లో భాగంగా చక్కర్లు కొడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైనిక బృందాలు ఇరువురు పైలట్లను సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది.
అయితే, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ లెఫ్టినెంట్ కర్నల్ సౌరభ్ యాదవ్ చికిత్స పొందుతూ మరణించినట్లు పేర్కొంది. మరొకరికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది.