1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 12 ఫిబ్రవరి 2015 (17:08 IST)

ఢిల్లీ సీఎం పదవి చేపట్టక ముందే.. హామీల అమలుకు కేజ్రీవాల్ చర్యలు!

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల హామీలపై దృష్టిసారించారు. ఎన్నికల ప్రచార సమయంలో నియోజకవర్గాల వారీగా రూపొందించిన మేనిఫెస్టోల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలంటూ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేజ్రీవాల్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. 
 
కాగా, ఈనెల 14వ తేదీన ఆయన ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెల్సిందే. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న కేజ్రీవాల్‌‍ను బుధవారం ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ డీఎం స్పోలియా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 70 హామీలతో కూడిన ఆప్ మేనిఫెస్టోను కేజ్రీవాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు. 
 
మేనిఫెస్టోలోని హామీలను అమలు చేసేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ (కార్యాచరణ ప్రణాళిక)ను సిద్ధం చేయాలని సీఎస్‌కు కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 19లోగానే సదరు రోడ్ మ్యాప్ కాపీ తమకు అందజేయాలని కూడా కేజ్రీవాల్ డెడ్‌లైన్ విధించినట్టు సమాచారం. 50 శాతం మేర విద్యుత్ చార్జీల తగ్గింపు, నగరంలో ఉచిత వై-ఫై, నగరంలో 10-15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు, గల్లీగల్లీకి నాణ్యమైన నీటి సరఫరా వంటివి ప్రధానమైన హామీలుగా ఉన్నాయి.