గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (16:36 IST)

టమోటా తోటకు సీసీటీవీ కెమెరాలతో నిఘా

tomatto
దేశ వ్యాప్తంగా టమోటాల ధర ఏ విధంగా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీటికి ఒక్కసారిగా రెక్కలు రావడంతో వినియోగదారులు గగ్గోలు పెట్టారు. గత కొన్ని రోజులుగా టామోటా ధరలపైనే చర్చలు జరుగుతున్నాయి. టమోటా లారీల అదృశ్యం, తోటల్లో చోరీలు జరుగుతుండటంతో ఓ రైతు తనకు అలాంటి పరిస్థితి రాకుండా టమోటా తోటకు ఏకంగా సీసీ కెమెరాలు అమర్చుకున్నాడు. 
 
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాకు చెందిన శరద్‌ రావత్‌ అనే రైతు టమోటాలను దొంగలు ఎత్తుకెళ్లకుండా పొలానికి రక్షణగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశాడు. టమోటాలకు అధిక ధర పలకడంతో పలు చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి. అందుకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. అందుకు రూ.22 వేలు వెచ్చించినట్లు తెలిపాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో టమోటా ధర కేజీ రూ.160 ఉంది.
 
చాలా రోజుల నుంచి దేశంలో టమోటాలు చోరీకి పాల్పడుతున్న విషయంతెలిసిందే. సోమవారం కర్ణాటకలోని కోలారు నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లున్న టమోటా లోడు అదృశ్యమైంది. అందులో సుమారు రూ.21 లక్షల విలువైన టమోటాలు ఉన్నాయి. మరో ఘటనలో జార్ఘండ్‌ కూరగాయల మార్కెట్‌లో 40 కిలోల టమోటాలను దొంగిలించారు.