గురువారం, 17 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (18:40 IST)

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

derailed
ఇటీవల తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతంలో భాగమతి ఎక్స్‌‍ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. లూప్ లైనులో ఆగివున్న గూడ్సు రైలను 90 కిలోమీటర్ల వేగంతో వచ్చిన భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదు. కానీ, 200 మంది వరకు గాయపడ్డారు. పది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నట్టు రైల్వే శాఖ విచారణ బృందం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ ప్రమాదం నుంచి ఇంకా మరిచిపోకముందే అస్సాంలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 
 
అస్సాం రాష్ట్రంలోని దిమా హసావో జిల్లాలో అగర్తలా నుంచి ముంబైకి బయల్దేరిన ఈ రైలు ఇంజిన్‌తో పాటు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. అస్సాంలోని దిబలోంగ్‌ స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్న 3.55 గంటలకు జరిగింది. రైలు ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. 
 
ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఉండే పవర్‌ కార్‌, ఇంజిన్‌తో పాటు ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందగానే.. సహాయక బృందాలు చేరుకున్నాయని తెలిపారు. ఈ ఘటనతో లుమ్‌డింగ్ - బాదర్‌పూర్ సింగిల్ - లైన్ హిల్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు వెల్లడించారు.