ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (10:50 IST)

అసోంలో భూకంపం.. మూడుసార్లు కంపించిన భూమి.. వీడియో వైరల్

అసోంలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత మరో రెండు సార్లు భూమి కంపించింది. ఉదయం 7.51 గంటల ప్రాంతంలో సోనిత్‌పూర్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. ఆ తర్వాత 8.13 గంటలకు, 8.34 గంటలకు మూడోసారి ప్రకంపనలు వచ్చాయి. 
 
వరుసగా మూడుసార్లు ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. 6.4 తీవ్రతతో వచ్చిన భూకంపంతో ఉత్తర బెంగాల్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి.
 
కూచ్‌ బెహార్‌, మాల్దా, జల్పాయిగురి, సిలిగురి, ముర్షిదాబాద్‌ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. అలాగే మేఘాలయలోనూ పలు ప్రాంతాలోనూ ప్రభావం కనిపించింది. తేజ్‌పూర్‌కు పశ్చిమ నైరుతి దిశలో 43 కిలోమీటర్ల దూరంలో భూపంక కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్‌సీఎస్‌ తెలిపింది.
 
భూకంపంపై సీఎం సర్బానంద సోనావాల్‌స్పందించారు. అసోంలో భారీ భూకంపం వచ్చిందని, అందరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. 
 
వరుస ప్రకంపనల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పిస్తున్నట్లు చెప్పారు. భారీగా వచ్చిన ప్రకంపనలతో భవనాలు దెబ్బతిన్నాయి. ఇంకా ఒక భవనంపై మరో భవనం కూలిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే ఫొటోలను హిమంత బిశ్వ శర్మ ట్వీట్‌ చేశారు. ఈ ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.