అసోంలో వరదలు.. నీటమునిగిన గ్రామాలు.. 33కి చేరిన మృతుల సంఖ్య
కరోనా ఓ వైపు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంటే.. మరోవైపు ప్రకృతీ వైపరీత్యాలు ముంచేస్తున్నాయి. తాజాగా అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్, నల్బరీ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు వరదల్లో మృత్యవాత పడ్డారు. దీంతో అసోం వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 33కు పెరిగింది.
33 జిల్లాలుండగా 21 జిల్లాల్లో 1.5 మిలియన్ల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. బ్రహ్మపుత్ర నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కజిరంగా జాతీయ పార్కు వరదనీటిలో మునిగిపోవడంతో 18 వన్యప్రాణులు మరణించాయి.
ఏడు జింకలు, రెండు అడవి దున్నలు నీటమునిగి మరణించాయి. అలాగే రెండువేలకు మించిన గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో 15వేల మంది వరద బాధితులను 254 సహాయ శిబిరాలకు తరలించారు. 4,200 మందిని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 87,000 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి.