సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (12:07 IST)

బాలాసోర్ ట్రాక్ పునరుద్ధరణ - పట్టాలపై పరుగులు పెట్టిన తొలి రైలు

balasore track restoration
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ధ్వంసమైన రైల్వే ట్రాక్‌ను రైల్వే సిబ్బంది కేవలం 51 గంటల్లోనే పునరుద్ధరించి, ఈ ట్రాక్‌పై రైలును నడిపారు. ఈ ట్రాక్ పునరుద్ధరుణ పనులు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దగ్గరుండి పర్యవేక్షించారు. లూప్‍లైన్‌లో ఆగివున్న గూడ్సు రైలును షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ వెళుతున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు 128 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొట్టింది. ప్రధాన లైన్‌‌లో వెళ్లాల్సిన ఈ ఎక్స్‌ప్రెస్ రైలు.. లూప్‌లైనులోకి దూసుకుని రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 275 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో వెయ్యి మందికిపై ప్రయాణికులు గాయపడ్డారు. 
 
ఈ ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్‌లో రైళ్ల రాకపోకలను తిరిగిప్రారంభించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ట్రాక్‌ను సరిచేసేందుకు రైల్వే సిబ్బందితో పాటు కూలీలను రంగంలోకి దించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఘటనా స్థలంలోనే ఉండి పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు. వెయ్యి మంది కూలీలు, భారీగా యంత్రాలను ఉపయోగించి ఈ పనులు శరవేగంగా జరిగేలా ఆయన చర్యలు తీసుకున్నారు. పూర్తిగా ధ్వంసమైన రెండు ట్రాక్‌లను కేవలం 51 గంటల్లోనే పునరుద్ధరించి పూర్తి చేశారు. 
 
పునరుద్ధరించిన ట్రాక్‌పై గూడ్సు రైలు వెళుతుండగా తీసిన వీడియోను రైల్వే మంత్రి వైష్ణవ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు ట్రాక్‌పై గూడ్సు రైలు వెళుతున్న సమయంలో ఆయన రెండు చేతులు జోడించి నమనస్కరిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం సాయంత్రం తొలి రైలు ట్రాక్‌పై పరుగులు పెట్టిందని ట్వీట్ చేశారు.