శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (13:44 IST)

న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుపెట్టుకోవాలి : చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

nvramana
ఢిల్లీ వేదికగా జాతీయ న్యాయ సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల హైకోర్టులు హాజరయ్యారు. 
 
ఈ సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, న్యాయమూర్తులు ఎల్లవేళలా లక్ష్మణ రేఖను గుర్తుపెట్టుకోవాలన్నారు. లక్ష్మణ రేఖను దాటడం ఏమాత్రం మంచిదికాదన్నారు. న్యాయమూర్తులు విధి నిర్వహణలో పరిధిలు గుర్తించాలన్నారు. 
 
శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలకు వేర్వేరు అధికారాలు ఉంటాయన్నారు. ఈ మూడు వ్యవస్థలు ప్రజాస్వామ్యం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో పిల్‌లు దుర్వినియోగమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్‌లు కాస్త వ్యక్తిగత వ్యాజ్యాలుగా మారుతున్నాయన్నారు. 
 
దేశంలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి మరిన్న చర్యలు తీసుకోవాల్సివుందన్నారు. ప్రజాక్షేత్రంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందే వార్డు సభ్యుడు నుంచి లోక్‌సభ సభ్యుడు వరకు ప్రతి ఒక్కరినీ గౌరవించాల్సిందేనన్నారు. అయితే, అందరి విషయంలో చట్టం మాత్రం సమానంగా ఉంటుందన్నారు. 
 
కేసుల పరిష్కారానికి మరింత సిబ్బంది అవసరమన్నారు. కోర్టుల్లోని మానవవనరుల కొరత తీరితే కేసుల భారం తగ్గుతుందని, కోర్టుల ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసుల సంఖ్య పెరిగిపోతుందని  జస్టిస్ ఎన్వీ రమణ గుర్తుచేశారు.