శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2024 (21:20 IST)

ఓ సాదాసీదా ఆర్టీఓ కానిస్టేబుల్: ఇంట్లో రూ. 11 కోట్లు నగదు, 52 కేజీల బంగారం, 234 కిలోల వెండి, ఎలా వచ్చాయి?

Bhopal Raid
ప్రభుత్వ ఉద్యోగి అయితే చాలు. అపర కుబేరుడిగా మారిపోవచ్చని కొందరు ఉద్యోగులు అవినీతి దారిని ఎంచుకుంటారు. అధికారంలో వున్నంతవరకూ పైఅధికారులకు కాస్తంత తాయిలాలు అందిస్తూ ఎలాగో కప్పదాటు దాటేస్తూ ప్రజల వద్ద లంచాలు రూపంలో కోట్లు వెనకేస్తుంటారు. ఐతే పాపపు సొమ్ము ఏదో ఒకరోజు ఖచ్చితంగా పగపడుతుంది కదా. అలాంటిదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ఆర్టీవో మాజీ కానిస్టేబుల్ విషయంలో జరిగింది. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పరిధిలో ఆర్టీఓగా పనిచేసిన సౌరభ్ శర్మ 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఒక్కసారిగా అపరకుబేరుడైపోయాడు. అతడి జీవనశైలి చుట్టుపక్కలవారికి వింతగానూ తోచింది. తనకు వచ్చే జీతంతో అయితే అది సాధ్యం కాదని తెలుసు. కానీ ఎవరికివారే మౌనం వహించారు. కానీ ఆయనచే పీడించబడినవారు ఎవరో ఒక్కరు మాత్రం అవినీతి నిరోధక శాఖ చెవినపడేసారు. అంతే బండారం అంతా బయటపడింది. అతడి ఇంట్లో సోదాలు చేస్తుంటే గుట్టలకొద్దీ నోట్ల కట్టలూ, కిలోలకొద్దీ బంగారం వెండి నగలు చూసి అధికారులు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇప్పటివరకూ అతడికి చెందిన రూ. 11 కోట్ల నగదు, 52 కిలోల బంగారం, 234 కిలలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఐతే అధికారులు వస్తున్నారని తెలుసుకున్నారో ఏమోగానీ... రెండురోజులు ముందుగా అతడు విదేశాలకు చెక్కేసాడు.
 
ఇక ఈయనకు సంబంధించి మరింత లోతుగా విచారిస్తే మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. సౌరభ్ నియామకానికి సంబంధించిన పత్రాలు కూడా నిజమైనవి కావని, గ్వాలియర్ హైకోర్టు న్యాయవాది అవధేష్ తోమర్ ఆరోపించారు. అడ్వకేట్ అవధేష్ తోమర్ కూడా రవాణా శాఖ ఇవ్వని నియామక పత్రాలను ఆర్టీఐ ద్వారా అడిగారు. సౌరభ్ అన్నయ్య సచిన్ శర్మ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారని, అందుకే మరొకరిని కారుణ్యంగా నియమించడం చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సిఫార్సు మేరకు సౌరభ్‌ శర్మను నియమించినట్లు సమాచారం.
 
సౌరభ్ శర్మ కేసులో డీజీ లోకాయుక్త జైదీప్ ప్రసాద్ ప్రకటన కూడా వచ్చింది. సౌరభ్‌శర్మకు చెందిన ఆవరణలో లభించిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న అనంతరం తదుపరి విచారణ జరుపుతున్నారు. ప్రధాన నిందితుడు సౌరవ్ శర్మ ఇప్పటికే అందుబాటులో లేకుండా పోయాడు. 11 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. సౌరభ్ శర్మను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.