1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (11:40 IST)

అయోధ్యలో విషాదం : పుణ్యస్నానానికెళితే ప్రాణాలు పోయాయి...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి సరయూ నదిలో రెండు కుటుంబాలకు చెందిన 15 మంది నీట మునిగారు. వీరిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ముగ్గురిని అధికారులు రక్షించారు. మరో ముగ్గురు గల్లంతు కాగా.. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగ్రా నుంచి రెండు కుటుంబాలకు చెందిన 15 మంది.. అయోధ్య పర్యటనకు వచ్చారు. సరయూ నది గుప్తార్ ఘాట్ వద్ద శుక్రవారం.. స్నానం చేసేందుకు వారంతా నీటిలో దిగారు. వారిలో ఓ మహిళ నీట మునగటంతో ఆమెను కాపాడే ప్రయత్నంలో 15 మంది నీట మునిగారు. 
 
అందులో ముగ్గురు వ్యక్తులు తమంతట తాముగా ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. ఆరుగు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేష్ పాండే ఘటనాస్థలికి చేరుకున్నారు. 
 
ప్రాణాలతో బయటపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వారికోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎప్, పీఏసీ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ వినయ్ కుమార్ తెలిపారు.