శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (08:45 IST)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఓట్ల లెక్కింపు ప్రారంభం... ఆధిక్యంలో మహాకూటమి!

బీహార్ రాష్ట్ర శాసనసభకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 38 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 
 
బీహార్‌ ముఖ్యమంత్రి పీఠం యువనేత తేజస్వీ యాదవ్‌కు దక్కుతుందా? లేక ప్రస్తుత సీఎం, అధికార జేడీయూ-బీజేపీ కూటమి నేత నితీశ్‌ కుమార్‌(69)కే మళ్లీ సొంతమవుతుందా? అనే ఉత్కంఠకు మరికొద్దిసేపట్లో తెరపడనుంది. నితీశ్‌ వయసులో సగం కంటే తక్కువగా ఉన్న ఆర్జేడీ యువ నేత తేజస్వీయాదవ్‌(31) నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌కు అధికారం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన నేపథ్యంలో ఈ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. 
 
రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్‌ 28వ తేదీ మొదలుకొని నవంబర్‌ 7వ తేదీ వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అలాగే, బీహార్‌లోని వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానంతోపాటు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలోని 28 స్థానాలు, ఇతర 10 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడి కానున్నాయి.