1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (17:05 IST)

కోర్టు తీర్పు అర్థంకాక నిర్దోషిని జైల్లో పెట్టిన బీహార్ పోలీసులు

సాధారణంగా చాలా మందికి ప్రాంతీయ భాషలు మినహా ఇతర భాషలు రావు. ముఖ్యంగా, జాతీయ భాష అయిన హిందీతో పాటు ఆంగ్లం చాలా మందికి రాదు. అయితే, భాష తెలియకపోయినప్పటికీ ఫర్వాలేదు. కానీ, తెలిసినట్టుగా ఫోజులు కొడుతూ, భావం అర్థం కాకపోతే వచ్చే చిక్కులు మాత్రం అన్నీఇన్నీకావు. తాజాగా బీహార్‌లో ఓ కోర్టు న్యాయమూర్తి ఇంగ్లీషులో ఇచ్చిన తీర్పు భావం అర్థంకాక నిర్దోషిని పోలీసులు ఒక రాత్రంతా జైల్లో ఉంచారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జెహానాబాద్‌కు చెందిన వ్యాపారి నీరజ్ కుమార్ కొన్నేళ్ల క్రితం విడాకుల కోసం కోర్టులో కేసు దాఖలు చేశాడు. కేసును విచారించిన స్థానిక కోర్టు.. నీరజ్‌కు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక వివరాలను తమముందు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. 
 
తీర్పు ఉత్తర్వుల్లో డిస్ట్రెస్ వారెంట్ అనే పదాన్ని చేర్చింది. దీన్ని అరెస్ట్ వారెంట్‌గా తప్పుగా అర్థం చేసుకున్న పోలీసులు నీరజ్‌ను నవంబర్ 25వ తేదీన రాత్రంతా జైలులో ఉంచారు. కానీ, మరుసటి రోజు నీరజ్ న్యాయవాది కోర్టును ఆశ్రయించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు నీరజ్‌ను వదిలివేశారు. ఈ ఘటన గత నెల 25వ తేదీన పాట్నాలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.