సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (07:46 IST)

బీహార్ వైద్యుల నిర్లక్ష్యం : హైడ్రోసిల్ ఆపరేషన్ చేయమంటే.. పెళ్లికి పనికిరాకుండా చేశారు..

bihar youth
బీహార్ రాష్ట్రానికి చెందిన వైద్యులు మరోమారు పత్రికలకు ఎక్కారు. ఓ యువకుడిని పెళ్లికి పనికిరాకుండా చేశారు. హైడ్రోసిల్ ఆపరేషన్ చేయమంటే ఏకంగా వ్యాసక్టమీ (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఫలితంగా ఆ యువకుడు పెళ్లికి పనికిరాకుండా పోయాడు. దీనిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రంలోని కైమూర్‌లోని చైన్‌పూర్ పరిధి జాగారియా గ్రామానికి చెందిన రామ్ దహిన్ సింగ్ యాదవ్‌‍కు మనక్క యాదవ్ అనే 30 యేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈయనకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించాడు. అయితే, మనక్కకు ఊహించని సమస్య ఒకటి వచ్చిపడింది. కొన్ని నెలలుగా అతను హైడ్రోసిల్ సమస్యతో బాధపడుతున్నాడు. అయితే, వీరి ఆర్థిక సమస్యల కారణంగా ఆ ఆపరేషన్ చేయించుకోలేక పోయాడు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెబితే పరువు పోతుందని ఇన్నాళ్లూ దాచి పెట్టాడు.  
 
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఈ సమస్య ఎక్కువైంది. మరోవైపు, పెళ్లి సంబంధాలను వేగవంతం చేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన సమస్యను కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అయితే, ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించే స్థోమత లేదు. చివరకు స్థానికుల సహకారంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడే అసలు సమస్య వచ్చిపడింది. 
 
అతన్ని పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత అతని కుటుంబ సభ్యుల అనుమతితో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్టు చెప్పారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. ఆ యువకుడికి హైడ్రోసిల్ ఆపరేషన్ చేయకుండా కుటుంబ నియంత్రణ (మేల్ స్టెరిలైజేషన్) ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ఆ యువకుడితతో మీకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విజయవంతగా పూర్తి చేసినట్టు చెప్పారు. దీంతో ఆ వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఖంగుతిన్నారు. 
 
మా కొడుకు సమస్య ఏంటి.. మీరు చేసిందేమిటి అని బాధితుడికి కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నామని ఇపుడు తమ కొడుకు పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బీహార్ వైద్యులు చేసిన ఈ పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది.