లూజ్ హెయిర్‌తో వస్తే నో ఎంట్రీ : : సుందరావతి మహిళా మహా విద్యాలయం
బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పుర్‌లో ఉన్న సుందరావతి మహిళా మహా విద్యాలయం ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. జడ వేసుకుంటేనే విద్యాలయంలోకి విద్యార్థులకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
కళాశాల ఆవరణలో యువతులు పక్కాగా జడ వేసుకుని కనిపించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా ఈ ఏడాది ఇంటర్‌లో చేరిన బాలికలకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను నిర్దేశించింది. దీనితో పాటు విద్యార్థినిలు కళాశాల ఆవరణలో సెల్ఫీలు తీసుకోవడం కూడా నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
అమ్మాయిలు లూజ్ హెయిర్‌తో వస్తే వారిని కళాశాలలోకి అనుమతించబోమని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామన్ సిన్హా తేల్చి చెప్పారు. కళాశాల కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది.
సైన్స్, కామర్స్, ఆర్ట్స్ అనే మూడు విభాగాలు ఉన్న ఈ కళాశాలలో ప్రస్తుతం 1,500 మంది అమ్మాయిలు చేరారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ కొత్త డ్రెస్ కోడ్‌ను నిర్ణయించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
అందులో ఉన్న సభ్యులు సూచించిన దుస్తులనే ధరించాలని కళాశాల యాజమాన్యం నిర్ణయించింది. సంస్థ అదేశాలను ఎవరైనా అతిక్రమించి డ్రెస్‌కోడ్ లేకుండా, జడ వేసుకోకుండా వచ్చే వారికి ప్రవేశం లేదని స్పష్టంచేసింది.