మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 5 మే 2017 (02:36 IST)

ముగ్గురిని అత్యాచారం చేసి చంపిన ముష్కరులు నాలుగో ఆమెను వదిలేశారు. యావజ్జీవం తప్పలేదు

గుజరాత్‌లో సంచలనం రేపిన బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచారం కేసులో 12 మందికి జీవిత ఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. దోషుల్లో ముగ్గురికి ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో విధుల్ల

గుజరాత్‌లో సంచలనం రేపిన బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచారం కేసులో 12 మందికి జీవిత ఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. దోషుల్లో ముగ్గురికి ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులు, వైద్యులను నిర్దోషులుగా ప్రకటించిన కింది కోర్టు తీర్పును పక్కనబెట్టింది.
 
2002 గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో అహ్మదాబాద్‌ సమీపంలోని రంధిక్‌పూర్‌లోని బిల్కిస్‌ ఇంటిపై దాడి చేశారు. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్‌ కుటుంబ సభ్యులు ఏడుగురిని హతమార్చారు.  బతుకు భయంతో తమ తమ నివాసాలను వదిలి ట్రాక్టర్‌పై పిల్లా పాపలతో వెళ్తున్న పౌరులను వేటాడి, వెంటాడి చంపిన ఘాతుకమిది. దాదాపు 30మంది దుండగుల విచ్చుకత్తులకు నలుగురు మహిళలు, నలుగురు పిల్లలు సహా 14మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ దుర్మార్గులు బిల్కిస్‌ బానో అనే మహిళను, ఆమె తల్లిని మరో ఇద్దరు మహిళలను దారుణంగా హింసించి అత్యాచారం చేశారు. మిగిలిన ముగ్గురూ అక్కడికక్కడే మరణిస్తే బిల్కిస్‌ బానో చచ్చిపడినట్టు నటించింది. దాంతో వారు ఆమెను పొదల్లోకి విసిరేసి నిష్క్రమించారు. ఆ తర్వాత ఆమె ఒకటిన్నర దశాబ్దంపాటు న్యాయస్థానాలే వేదికగా మొక్కవోని పోరాటం చేసిన పర్యవసానంగా ప్రస్తుత కేసులో దుండగులకు శిక్షలు ఖరారయ్యాయి.
 
పదిహేనేళ్లు గడిచినా ఈనాటికీ ఆ మారణహోమాన్ని తల్చుకుని విలపించని, వణికిపోని వారుండరంటే బాధితుల్ని అదెంతగా భీతావహుల్ని చేసిందో అర్ధం చేసుకోవచ్చు. అయినవాళ్లను, ఆసరాను కోల్పోయి దిక్కులేని పక్షుల్లా మిగిలినవారు అనంతర కాలంలో బెదిరింపులకు లోనయ్యారు. ప్రలోభాలు వచ్చిపడ్డాయి. ఫలితంగా బాధితుల్లో కొందరు మౌనంగా ఉండిపోయారు. కనుకనే ఈ కేసులో ప్రధాన సాక్షిగా, బాధితురాలిగా ఉన్న బిల్కిస్‌ బానో ధైర్యసాహసాలకు చేతులెత్తి మొక్కాలి.

ఆమెకు అయినవాళ్లెవరూ లేరు. నిరుపేద మహిళ. ఆ విషాదం చోటుచేసుకునే నాటికి ఆమె వయసు 19 ఏళ్లు. ఆరునెలల గర్భిణి. ఆ మాట చెప్పినా దుండగులు వదల్లేదు. చెంతనున్న ఆమె పాపను బండకేసి బాది చంపారు. ఊరినుంచి  14మంది బంధువులతోపాటు మొత్తం 17మంది బయల్దేరితే మారణకాండ తర్వాత తనతో ఆరు, మూడు సంవత్స రాలున్న ఇద్దరు పసివాళ్లు మాత్రమే మిగిలారు. ఒంటిపై దుస్తులు కూడా సరిగాలేవు.
 
అలాంటి స్థితిలో ఒక ఆదివాసీ మహిళ ఇచ్చిన బట్టలు వేసుకుని హోంగార్డు సాయంతో దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె నిరక్షరాస్యతను ఆసరా చేసుకుని వారు ఆ ఫిర్యాదును తారుమారు చేశారు. పోస్టుమార్టం నివేదికలకు సైతం ఆ గతే పట్టింది. ఆమె చెప్పే మాటల్లో నిలకడలేదని పోలీసులు తేల్చారు. మేజిస్ట్రేట్‌ కోర్టు కూడా ఆమె ఫిర్యాదును సమర్ధించే సాక్ష్యాధారాలు లేవని కేసు కొట్టేసింది. ఈ అన్యాయంపై బిల్కిస్‌ బానో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పర్య వసానంగా ఆమె ఫిర్యాదులో దర్యాప్తు చేయదగ్గ అంశాలున్నాయన్న నిర్ధారణకు సుప్రీంకోర్టు వచ్చింది. ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించింది. ఈలోగా ఖననం చేసిన ఎనిమిది మృతదేహాల తలలను మాయం చేశారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో కేసు విచారణను గుజరాత్‌ నుంచి ముంబైకి మార్చాలని సుప్రీంకోర్టు నిర్ణ యించింది. విచారణ అనంతరం కింది కోర్టులో నిందితుల్లో 12మందికి యావజ్జీవ శిక్ష పడింది. అయిదుగురు పోలీసు అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన ఇద్దరు వైద్యులు నిర్దోషులని తీర్పు వచ్చింది. వారికి సైతం శిక్ష పడాలన్న పట్టుదలతో బిల్కిస్‌ బానో పోరాడింది.

ఆ విషాద క్షణాలను మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటూ అన్నిటినీ ఆమె న్యాయస్థానం ముందుంచింది. ఫలితంగా ఈ ఏడుగురు సైతం దోషులేనని బొంబాయి హైకోర్టు ఇప్పుడు  నిర్ధారించింది. అయితే విచారణ సమయంలో జైల్లో ఉన్న కాలాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్షా కాలం నుంచి మినహాయింపునిచ్చి, రూ. 20,000 చొప్పున వారికి జరిమానా విధించింది.
 
ఒక పేదింటి మహిళ తానే అన్నీ అయి చేసిన పోరాటం...దాన్ని గుర్తించి ఆ అన్యాయాన్ని సరిదిద్దాలన్న కృతనిశ్చయంతో పనిచేసిన న్యాయవ్యవస్థ పౌరులకు ధైర్యాన్నిస్తాయి. ఈ వ్యవస్థపై విశ్వాసాన్ని కలగజేస్తాయి. ఆమె ఏమాత్రం నిరాశానిస్పృహలకు లోనైనా ఆ మానవ మృగాలు చట్టంనుంచి సులభంగా తప్పించుకునేవే. కానీ బిల్కిస్‌ బానో వారికా అవకాశం ఇవ్వలేదు. నిలబడింది. తనలో ఉన్న నమ్మకాన్ని కాపాడుకుంది. కనుకనే ఎంతో ఆలస్యమైనా గెలిచింది.