బిపిన్ రావత్ మరణం తీవ్ర ఆవేదన కలిగిస్తుంది : ప్రధాని మోడీ సంతాపం
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణం తీవ్ర వేదనకు గురిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఆర్మీ హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రమాదంలో రావత్‌తో పాటు ఆయన అర్థాంగి మధులికా రావత్‌తో సహా 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై ప్రధాని మోడీ తన సంతాప సందేశాన్ని విడుదల చేశారు.
ఈ ఘటనలో బిపిన్ రావత్, ఇతర సైనిక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. వారంతా దేశం కోసం అత్యంత అంకితభావంతో సేవలు అందించారని కీర్తించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
ముఖ్యంగా బిపిన్ రావత్ సిసలైన సైనికుడు అని, నిజమైన దేశ భక్తుడు అని ప్రధాని మోడీ కొనియాడారు. భారత సాయుధ బలగాలను ఆధునకీకరించడంలోనూ, ఆయుధ సంపత్తిని నవీకరించడంలోనూ విశేష సేవలందించారని వెల్లడించారు. వ్యూహాత్మక అంశాల్లో ఆయన ఆలోచనలు, దృక్కోణాలు ఎంతో ఉపయుక్తంగా ఉండేవని గుర్తుచేసారు. అలాంటి వ్యక్తి ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేక పోతున్నట్టు పేర్కొన్నారు.
ముఖ్యంగా, భారత త్రివిధ దళ తొలి అధిపతిగా రావత్ సైన్యంలో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. సాయుధ బలగాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన పరిష్కరించండంలో చొరవ చూపించడమే కాకుండా వాటి పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఆయన జాతికి అందించిన సేవలను దేశం ఎపుడూ మరిచిపోదని ప్రధాని మోడీ తన సంతాన ప్రటనలో పేర్కొన్నారు.