శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2024 (09:06 IST)

పోలింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే బీజేపీ అభ్యర్థి మృతి.. మళ్లీ రీపోలింగ్!!

kunwar sarvesh singh
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా తొలి దశ పోలింగ్ ఈ నెల 19వ తేదీన ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన స్థానాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాబాద్ లోక్‌సభ సీటు కూడా ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరపున కున్వర్ సర్వేశ్ సింగ్ పోటీలో ఉన్నారు. అయితే, శుక్రవారం పోలింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే ఆయన మృతి చెందారు. ఆయన వయసు 71 యేళ్లు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు గొంతు సమస్య ఉందని, గతంలోనే ఆపరేషన్ చేయించుకున్నారని, చెకప్ కోసం శనివారం ఎయిమ్స్‌కు వెళ్లారని ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి వెల్లడించారు. ఎయిమ్స్ గుండెపోటుతో మరణించారని మొరాదాబాద్ సిటీ బీజేపీ ఎమ్మెల్యే రితేష్ గుప్తా నిర్ధారించారు. అనారోగ్యానికి గురవ్వడంతో హాస్పిటల్‌కు వెళ్లారని చెప్పారు.
 
కాగా మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో తొలి దశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 19న పోలింగ్ ముగిసింది. ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థి రుచి వీరతో కున్వర్ సింగ్ తలపడ్డారు. 2014లో మొరాదాబాద్ ఎంపీగా గెలిచారు. అంతకుముందు మొరాదాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదిలావుంటే, కున్వర్ సర్వేశ్ సింగ్ అకాల మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కున్వర్ సింగ్ తన తుదిశ్వాస వరకు ప్రజాసేవ, సామాజిక సేవకే అంకితమయ్యారని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మోడీ స్పందించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి అమిత్ షా కూడా కున్వర్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కష్టపడి పనిచేసే మనిషి అని, ప్రజాదరణ కలిగిన నాయకుడు అని కొనియాడారు.