టార్గెట్ బిహార్ సక్సెస్.. ఇక టార్గెట్ తమిళనాడు మొదలైంది
ఉత్తర భారతదేశంలో ప్రతిపక్షమన్నదే లేకుండా తుత్తునియలు చేసి పడేసిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు శరవేగంగా తమిళనాడును చాపచుట్టేయాలని పావులు కదుపుతోంది. అంతకుముందే తెలుగు రాష్ట్రాలపైనా దృష్టి పెట్టిన బీజేపీ కేంద్రనాయకత్వం ఇప్పుడు తమిళనాడును తన ప్రధాన టార్గెట్
ఉత్తర భారతదేశంలో ప్రతిపక్షమన్నదే లేకుండా తుత్తునియలు చేసి పడేసిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు శరవేగంగా తమిళనాడును చాపచుట్టేయాలని పావులు కదుపుతోంది. అంతకుముందే తెలుగు రాష్ట్రాలపైనా దృష్టి పెట్టిన బీజేపీ కేంద్రనాయకత్వం ఇప్పుడు తమిళనాడును తన ప్రధాన టార్గెట్‌గా చేసుకుంది. ఆరుదశాబ్దాలుగా తమిళనాడులో పాతుకుపోయిన ద్రవిడ పార్టీల పట్టును పెకిలించడానికి కాంగ్రెస్ వల్ల కాకుండా పోయిన నేపథ్యంలో ఎలాగైనా సరే ఈసారి ఆ రాష్ట్రంలో బలంగా పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనంతరం తమిళ రాజకీయాల్లో శూన్యం ఏర్పడిన నేపథ్యం తనకు ఉపయోగపడుతుందని ప్రారంభంలో బీజేపీ సంబరపడినా ఆశించిన ఫలితాలు రాలేదు ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత, బీహార్‌లో పాత మిత్రుడు నితీశ్‌తో మళ్లీ పొత్తు కుదుర్చుకున్న తర్వాత, గుజరాత్‌లో భూకంపం పుట్టించి కాంగ్రెస్ ఎమ్మేల్యేలను కర్నాటకకు పారిపోయేలా చేసిన తర్వాత ఇప్పుడు వంతు తమిళనాడుదయింది.
ఇలా ఉత్తరాదిన కొనసాగుతున్న కమలవికాసాన్ని దక్షిణాదికీ విస్తరించాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్న బీజేపీ అధిష్టానం.. తమిళగడ్డపై జరుగుతున్న ప్రతి రాజకీయ కదలికలోనూ తన ముద్ర ఉండేలా చూసుకుంటోంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మారకం ప్రారంభోత్సవం కోసం రామేశ్వరం వెళ్లిన ప్రధాని మోదీ.. తన ప్రసంగంలో జయలలితను గుర్తుచేసుకోవటం, అమ్మలేని లోటు స్పష్టంగా కనబడుతోందని చెప్పటం తమిళనాడుపై బీజేపీ ఆసక్తిని స్పష్టం చేసింది. జయలలిత కన్నుమూశాక ఎనిమిది నెలల్లో మూడుసార్లు తమిళనాడు వచ్చిన మోదీ.. ఎప్పుడూ అమ్మ గురించి ఇంతలా ప్రస్తావించలేదు. కానీ, ఈసారి జయ, తమిళ ప్రజలపై ఇంతప్రేమను గుప్పించటం, తమిళనాట రాజకీయ గందరగోళాన్ని ప్రస్తావించటం కూడా మోదీ భవిష్యత్ ప్రణాళికలకు సంకేతాలే.
జయ మరణం తర్వాత ఏఐఏడీఎంకేలో ఆధిపత్యపోరు చీలికలు విపక్షాలు తమ పనిని చక్కబెట్టుకోవటంలో అపారమైన అవకాశాలు కల్పిస్తున్నాయి. విపక్ష డీఎంకే వేగంగా ఓటుబ్యాంకును పెంచుకుంటోంది. అన్నాడీఎంకేలో రెండు కూటముల మధ్య వివాదంతో ప్రభుత్వం పని తీరు కూడా మందగించింది. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు, అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న నిస్తేజం వల్ల రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను తనకనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీంతో రాష్ట్రంలో కేవలం 2.5 శాతం ఓటుబ్యాంకున్న బీజేపీ తన పరిధిని మరింత విస్తృతపరుచుకోవాలని భావిస్తోంది.
ద్రవిడ పార్టీలు పాతుకుపోయిన తమిళనాడులో చొచ్చుకుపోవటం బీజేపీకి అంత సులువేం కాదు. దీనికితోడు హిందీ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నచోట.. ఉత్తరాది పార్టీగా ముద్ర ఉన్న బీజేపీకి అనుకూల వాతావరణం ఉండదు. అందుకే బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. అన్నాడీఎంకేలో చీలికను అడ్డంపెట్టుకుని రాష్ట్ర వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటోంది. వీలున్నపుడల్లా తన పార్టీ విస్తృతిని పెంచుకోవాలని యత్నిస్తోంది. బీజేపీ జాతీయ నాయకత్వం, ఆరెస్సెస్ విస్తృతంగా ప్రయత్నిస్తున్నప్పటికీ రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపే సమర్థుడైన నేత లేకపోవటం బీజేపీకి పెద్ద అవరోధంగా మారింది. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇమేజీని పార్టీ విస్తరణకు వాడుకోవాలనుకుంటోంది.రజనీ సొంతంగా పార్టీ పెట్టినా బీజేపీకి అనుబంధంగానే ఆ పార్టీ ఉంటుందని ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, రజినీ సన్నిహితుడు గురుమూర్తి చెప్పటం గమనార్హం.